రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో వృత్తిపరమైన అడ్డంకులు సైతం ఎన్నో ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత రకరకాల కారణాలతో దాదాపు 350 మందికిపైగా జర్నలిస్టులు చనిపోయినట్టు అంచనా. కాగా, గుర్తింపు కోసం ఇచ్చిన కార్డులు కూడా నేడు చెల్లకుండాపోతున్నాయి. అనధికారిక ఆంక్షల పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి రాకుండా అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ కొత్త సచివాలయంలోనూ అదే పరిస్థితి. ఆధార్‌కార్డు చూపాలంటున్నది. సమాచారాన్ని గుప్పిట్లో బిగిస్తున్నది.
మీడియా అంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి. ఫోర్త్ ఎస్టేట్. రాజ్యాంగం కల్పించిన హక్కు. బాధ్యత కూడా. అయితే ఆ పాత్రను పోషించ డానికి వీలైన వాతావరణం ప్రస్తుతం దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ కనిపించడం లేదు. అది రోజురోజుకీ తగ్గిపోతున్నది. రానురానూ ప్రభుత్వాలకు, మీడియాకు మధ్య దూరం పెరుగుతున్నది. కాదు.. కాదు కావాలనే పెంచుతున్నారు. ప్రభుత్వం గానీ, సమాజం గానీ మీడియాను అలక్ష్యం చేసినా, నిర్లక్ష్యం ప్రదర్శించినా అంతిమంగా నష్టపోయేది ప్రజలు, ప్రభుత్వాలే అనే సంగతిని గుర్తించాలి. దాన్ని అనుమతించ కూడదు. కొన్నేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీడియాను టార్గెట్ చేస్తున్నాయి. పక్కలో బల్లెంగా పరిగణిస్తున్నాయి. ప్రజా సమస్యలను సమాజంతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడాన్ని సహించలేక పోతున్నాయి. యాజమాన్యాలను లోబరుచు కుంటున్నాయి. జర్నలిస్టులు, ఉద్యోగులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. కనీస వేతనాలు ఎండ్లతరబడి ఎండమావిగానే మిగిలాయి. ప్రజల కోసమే పనిచేసిన ఎన్డీటీవీ లాంటి ఛానళ్లు, న్యూస్‌క్లిక్, మింట్ తదితర వెబ్‌పోర్టర్లపై ఐటీ దాడులకు పాల్పడు తున్నాయి. కేసులు పెడుతున్నాయి. జర్నలిస్టుల్లో ఆభద్రతాభావాన్ని మరింత పెంచుతున్నాయి. ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదు. రాజ్యాంగంలోని కీలక వ్యవస్థల్లో నాలుగో స్తంభమే మీడియా. ప్రత్యేకంగా ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పౌరులకు వాక్ స్వాతంత్య్రం ఉంది. దాన్నే భావ ప్రకటనాస్వేచ్ఛ అంటున్నాం. అలాగే పత్రికాస్వేచ్ఛగా, మీడియా స్వేచ్ఛగా భావిస్తున్నాం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మాదిరిగానే మీడియా కూడా ఒకటి. వ్యాపార వేత్తలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు ఈ రంగంలోకి ప్రవేశించి లాభాలను పోగేసు కుంటున్నాయి. పెట్టుబడి మూలంగా మీడియా విస్తృతి పెరిగింది. కాగా అందులో కీలకభూమిక పోషిస్తున్న జర్నలిస్టులకు మాత్రం అన్యాయమే జరుగుతున్నది. నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. సహజంగానే జర్నలిస్టులు, మీడియా అనుదినం… జనస్వరంగా, ప్రతి అక్షరం ప్రజలపక్షాన రాయాలి. ప్రసారం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాలి. సమాజంలో 90శాతంగా ఉన్న పేదలు, అణగారిన తరగతులకు అండగా ఉండటం ‘కలం’ కార్మికుల ప్రాథమిక విధి. మొత్తంగా బాధితుల పక్షానే మీడియా నిలబడాలి. వారికోసమే పనిచేయాలి. అందుకు భిన్నంగా గత తొమ్మిదేండ్లుగా దేశంలో, రాష్ట్రంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల సమస్యలను రాసే, ప్రసారం చేసే ప్రజామీడియా నేడు తగ్గిపోతున్నది. అందుకు పాలకులే ప్రధాన కారణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మీడియాపై గుర్రుగా ఉన్నాయి. ఉక్కుపాదం మోపుతున్నాయి. మేం చెప్పిందే రాయాలి..మా మాటే వేదం అన్న తరహాలో వ్యవహరిస్తున్నాయి. వ్యతిరేకంగా రాసిన ఎంతో మంది జర్నలిస్టులు, రచయితలను అంతమొందించే పనిలో అసాంఘిక శక్తులు ఉంటే, వాటికే ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం గమనార్హం. గౌరి లంకేశ్, కాల్బుర్గీ, దభోల్కర్ , ఫన్సారే తదితర జర్నలిస్టులు, రచయితల కిరాతక హత్యలే ఇందుకు సాక్ష్యం. పత్రికాస్వేచ్ఛను అడగడుగునా అన్ని రకాలుగా అణచి వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మీడియా పరిమితులను ఎదుర్కొంటున్నది. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నది. దాని స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎంతమాత్రం క్షమించరానిది. సహించకూడనిది కూడా. అనుకూల మీడియాకే వాణిజ్య ప్రకటనలు ఇస్తూ, ప్రజల పక్షాన వార్తలు రాసే, ప్రసారం చేసే పత్రికలు, ఛానళ్లకు మాత్రం నిరాకరిస్తున్నాయి. వీటిలోనూ వేలాది మంది జర్నలిస్టులు, ఉద్యోగులు పనిచేస్తున్నారనే సంగతిని ప్రభు త్వాలు విస్మరిస్తున్నాయి. తద్వారా సంబంధిత జర్నలిస్టుల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తెలిసే ఇలా చేస్తే, ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. ఇదిలావుంటే, రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో వృత్తిపరమైన అడ్డంకులు సైతం ఎన్నో ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత రకరకాల కారణాలతో దాదాపు 350 మందికిపైగా జర్నలిస్టులు చనిపోయి నట్టు అంచనా. కాగా, గుర్తింపు కోసం ఇచ్చిన కార్డులు కూడా నేడు చెల్లకుండాపోతున్నాయి. అనధికారిక ఆంక్షల పేరుతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి రాకుండా అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ కొత్త సచివాలయం లోనూ అదే పరిస్థితి. ఆధార్‌కార్డు చూపాలంటున్నది. సమాచారాన్ని గుప్పిట్లో బిగిస్తున్నది. తమకు అవసరమనుకున్నప్పుడు లీక్‌లు ఇచ్చే సాంప్రదాయం తీసుకొచ్చింది. కరోనా లాక్‌డౌన్ జర్నలిస్టులు, మీడియా కష్టాలు మరింత పెంచింది. సమాజం స్థితిగతుల నిత్యం వార్తలు రాసే జర్నలిస్టులే అనేక కష్టాలతో కొట్టుమిట్టాడుతుండటం ఆందోళకరనం. ఆవేదనాభరితం. మీడియా ప్రజల కోసం పనిచేయాలన్నా, వాస్తవాలు రాయాలన్నా ప్రభుత్వాలు సహకరించాల్సిందే. లేదంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టు తొలుత ప్రజలు, అంతిమంగా ప్రభుత్వానికే నష్టం.
బి. బసవపున్నయ్య
9490099108