– 0.001 శాతం నిర్లక్ష్యమున్నా వెంటనే పరిష్కరించాలి
– ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘నీట్’ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షలు నిర్వహిస్తున్న జాతీయ పరీక్ష మండలి(ఎన్టీఏపై)పై మండిపడింది. నీట్‌యూజీ-2024 పరీక్షల్లో ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థగా ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నా న్యాయంగా వ్యవహరించాలని, తప్పిదం జరిగితే జరిగిందని అంగీకరించాలని, చర్యలు తీసుకున్నామని వివరించాలని ఎన్టీఏకు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టితో కూడిన వెకేషన్ ధర్మాసనం స్పష్టం చేసింది. తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దాలని ఎన్టీఏకు సూచించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పడే శ్రమను మరిచిపోకూడదని, పరీక్షలు నిర్వహిస్తున్న ఏజెన్సీగా ఎన్టీఏ న్యాయబద్ధంగా వ్యవహరించాలని ధర్మాసనం పేర్కొంది. ”పొరపాటు జరిగితే కనీసం ఫలానా చర్య తీసుకున్నామని చెప్పినా అది మీ పనితీరుపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎన్టీఏ నుంచి సకాలంలో సరైన చర్యలను ఆశిస్తున్నాం” అని తెలిపింది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని వ్యాఖ్యానించింది. నీట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రం, ఎన్టీఏకి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.