మీ ప్రభుత్వాన్ని విశ్వసించేలేం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ- ఢిల్లీ: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపుర్‌లోని రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మణిపుర్‌ సర్కారును విశ్వసించలేమంటూ జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం బుధవారం మండిపడింది. తీవ్ర అనారోగ్యానికి గురైన మైనారిటీ కుకీ తెగకు చెందిన విచారణ ఖైదీని జైలు నుంచి ఆస్పత్రికి తరలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిందితుడు మైనారిటీ కుకీ తెగకు చెందిన వాడనే వివక్షతో ఆస్పత్రికి తీసుకెళ్లక పోగా భద్రతా కారణాలను సాకుగా చూపడం దారుణం. అతనికి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తున్నాం. ఆ ఖైదీ ఆరోగ్యం క్షీణించిందని నివేదికల్లో వెల్లడైతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు’ అంటూ ధర్మాసనం హెచ్చరించింది. లున్‌ఖోంగామ్‌ హవోకిప్‌ అనే ఖైదీ అనారోగ్యానికి గురైనా జైలు అధికారులు భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదన్న మణిపుర్‌ హైకోర్టు ఉత్తర్వును పరిశీలించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. గువాహటి వైద్య కళాశాలకు నిందితుడిని తీసుకెళ్లి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. ఇందుకయ్యే ఖర్చును మణిపుర్‌ ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. వైద్య నివేదికలను ఈ నెల 15వ తేదీకల్లా తమకు అందజేయాలని ఆదేశించింది.

Spread the love