నవతెలంగాణ-హైదరాబాద్ : సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను తాజాగా విచారణకు స్వీకరించిన కోర్టు.. తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తమ వాదన ఏంటో తెలియజేయాలని సర్కార్ను, ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలేంటంటే.. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని మాట్లాడటంతో దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన 262 మంది ప్రముఖులు అతడిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.