నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘంలోని చివరి సీటు కోసం ఎన్నిక జరిపించేందుకు అంత తొందర ఎందుకని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను ఢిల్లీ కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు.. దీనికి సంబంధించిన ఛైర్మన్ ఎన్నిక నిర్వహణపై కూడా స్టే విధించింది.
జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది. ‘‘నామినేషన్ అంశం కూడా ఉంది.. దానిని పర్యవేక్షించేందుకు అక్కడ మేయర్ ఉన్నారు. మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది..? ఇలా జోక్యం చేసుకొంటూ పోతే ప్రజాస్వామ్యం ఏమైపోతుంది. దీనిలో కూడా రాజకీయాలా..?’’ అని న్యాయమూర్తులు లెఫ్టినెంట్ గవర్నర్‌ను నిలదీశారు. అనంతరం బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్‌ను కమిటీలోకి ఎన్నుకోవడంపై మేయర్ షెల్లీ ఓబ్రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎల్జీని బెంచ్ ఆదేశించింది. మరోవైపు ఆప్ దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్ స్పందించింది. ‘‘ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించవద్దు.. రెండు వారాల తర్వాత చూడండి’’ అని సూచించింది.