మసీదు కూల్చివేత..యూపీ సర్కారుకు సుప్రీంకోర్టు షోకాజ్‌ నోటీసులు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కుషీనగర్‌లోని మసీదును అక్రమ కట్టడంగా పేర్కొంటూ అధికారులు కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది నవంబర్‌ 13న సుప్రీంకోర్టు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. ఇతర పక్షాల వాదనలు వినకుండా కూల్చివేత చర్యలను సుప్రీంకోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా.. కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడిన సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ మేరకు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం యూపీ సర్కారుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కుషీనగర్‌ మసీద్‌ కేసులో తదుపరి కూల్చివేత చర్యలపై సుప్రీంకోర్టు నిషేధించింది. మద్ని మసీదు కొంత భాగాన్ని అధికార యంత్రాంగం కొంత మేరకు కూల్చివేసింది. వాస్తవానికి భూమిని ఆక్రమించి మసీదును నిర్మించారని ఆరోపణలున్నాయి. ఈ నెల ప్రారంభంలో మసీదులోని కొంత భాగాన్ని అధికారులు బుల్డోజర్‌తో కూల్చివేశారు. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మసీదు నిర్మాణంలో ఎలాంటి ఆక్రమణ జరుగలేదని.. ఈ విషయాన్ని ఎస్‌డీఎం నివేదికలో ప్రస్తావించినట్లుగా పిటిషనర్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు మసీదును కూల్చివేశారని.. తనపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఫేక్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారని పిటిషనర్‌ ఆరోపించారు. కూల్చివేతలకు ముందు అధికారులు తన వాదనలు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. కూల్చివేత చర్యలను వెంటనే నిషేధించాలని.. కూల్చివేసిన మసీదును పునర్నిర్మించాలని.. లేకపోతే పరిహారం చెల్లించాలని పిటిషనర్‌ డిమాండ్‌ చేశారు.

Spread the love