మోడీ హామీ మేరకే సుప్రీం తీర్పు

మోడీ హామీ మేరకే సుప్రీం తీర్పు– మాలలను అణగదొక్కాలని రేవంత్‌ రెడ్డి ప్లాన్‌
– నేడు ఛలో కలెక్టరేట్‌లు
– 7, 8, 9, 10 తేదీల్లో ఢిల్లీలో ధర్నా : ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన హామీ మేరకు, సుప్రీంకోర్టు వర్గీకరణ అనుకూల తీర్పునిచ్చిందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అభిప్రాయపడింది. రాజకీయ ఒత్తిళ్లతో వచ్చిన ఆ తీర్పును స్వాగతించేది లేదని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాలల ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఆర్డినెన్స్‌ తెచ్చి వర్గీకరణ అమలు చేస్తామన్న రేవంత్‌ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా అసెంబ్లీలో ప్రకటించడం వెనుక మాలలను అణగదొక్కాలనే కుట్ర ఉందని విమర్శించింది. దళితుల బతుకులు, ముఖ్యంగా మాలల జీవన స్థితిగతుల గురించి రాష్ట్ర శాసనమండలిలో విపులంగా మాట్లాడిన ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కృతజ్ఞతలు తెలిపింది.
ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోరాట సమితి చైర్మెన్‌ సర్వయ్య, కో చైర్మెన్‌లు జి.చెన్నయ్య, రామచందర్‌, సుధీర్‌, బాలనాథం, గుడిమల్లె వినోద్‌, తాళ్ళపల్లి రవి, పాలడుగు శ్రీనివాస్‌, బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్‌, బల్వంత్‌, రావుల విజరు కుమార్‌, సైదులు, బేరా బాలకిషన్‌, మేక వెంకన్న, పిల్లి సుధాకర్‌ తదితరులు మాట్లాడారు. ఎస్సీల వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు ఐదున రాష్ట్రంలో ఛలో కలెక్టరేట్‌, ఆగస్టు 7, 8, 9, 10 తేదీల్లో నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన డిమాండే తప్ప తెలంగాణలో అవసరం లేనిదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందారని, మాల, ఆ ఉపకులాలు పూర్తిగా నష్టపోయాయని తెలిపారు.

Spread the love