ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు హర్షనీయం

On classification of sc The supreme verdict is exhilarating– రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి
– ఎస్టీ, బీసీల వర్గీకరణా చేపట్టాలి: విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సూర్యాపేట
ఎస్సీల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీవో తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా వర్గీకరణకు చట్టబద్ధత వచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో మరింత వెనుకబడిన కులాలకు విడివిడిగా కోటాలు ఇచ్చుకోవడానికి అనుమతించడం సానుకూలమైన అంశమన్నారు. బీసీలలో కూడా అత్యంత వెనుకబడిన సామాజిక తరగతులు కడుపేదరికం అనుభవిస్తున్నా యని తెలిపారు. రిజర్వేషన్ల ఫలితాలు అన్ని తరగతులకూ దక్కాలంటే బీసీల్లోనూ వర్గీకరణ చేపట్టాలని కోరారు. ఈ వర్గీకరణను స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లకు వర్తింపజేసేం దుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. బీసీ, ఎస్టీ వర్గీకరణలు శాస్త్రీయంగా చేయాలన్నారు.
”రైతులకు రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ, రేషన్‌ కార్డు ఆధారంగా రుణమాఫీ అమలు చేయడం సరికాదు.. కొన్ని జిల్లాల్లో గతంలో భర్త పేరుతో బ్యాంకులో వ్యవసాయ అవసరాల కోసం రుణం తీసుకుంటే.. ఇప్పుడు భర్త చనిపోతే రుణమాఫీ కావడం లేదు..” అని అన్నారు. అలాగే, నాలుగు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే ఒక్క బ్యాంకు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. అన్ని బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ కొన్ని హామీలు మాత్రమే అమలు చేసిందని మిగతా హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైనం దున ప్రభుత్వం వెంటనే రైతు భరోసా విడు దల చేయాలని కోరారు. కల్తీ విత్తనాలు, ఎరు వులు, పురుగుల మందులను నివారించాల న్నారు. నాగార్జునసాగర్‌ పరిధిలో ఉన్న లిఫ్టుల నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, నగరపు పాండు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.

Spread the love