న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద్ రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌తో పాటు సీబీఐకీ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం సోమవారం విచారించింది. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డితో పాటు సీబీఐకి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. జులై 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు కేసును విచారించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.