ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో వివక్షత వలన మన ప్రాంతం వెనుకబడిపోయిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సాగిన పోరాటాల ఫలితంగా పదేండ్ల క్రితం తెలంగాణ ఏర్పడింది. రాష్ట్రమైతే ఏర్పడింది. నీళ్ల విషయంలోనే రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు సమసిపోలేదు. దీనికోసం ఏర్పడిన బ్రిజేష్ ట్రిబ్యునల్ కూడా సమస్యల్ని పరిష్కరించడం లేదు. రాష్ట్రం కృష్ణా-గోదావరి నదుల మధ్య ఉంది. ఈ నదుల్లో తెలంగాణకు భూపాలపట్నం ఇంద్రావతి జల విద్యుత్ ఉత్పత్తి నీటితో కలిపి 1343.69 టీఎంసీల జలాలు మన రాష్ట్రం వినియోగించుకోవటానికి వీలుంది. అయినా, సాగు తాగునీటికొరత నేటికీ కొనసాతూనేేవుంది. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా ఉన్న నదులనీటిని సద్వినియోగం చేయగలిగితే 134.30 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యము కలుగుతుంది. కానీ, ఆదిశగా చర్యలు తీసుకోకపోవడంతో నేటికీ నీటి కొరత నుండి రాష్ట్రం విముక్తి కాలేదు.
తెలంగాణ ఇప్పటికి వ్యవసాయక రాష్ట్రమే. రాష్ట్ర బౌగోళిక విస్తీర్ణం283.65 లక్షల ఎకరాలు కాగా సాగు యోగ్యమైన భూమి 167.17 లక్షలు ఎకరాలు ఉన్నవని ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నవి. 1956 నాటికి తెలంగాణలో 3,49,993 ఎకరాలకు పన్నెండు ప్రాజెక్టుల కింద సాగునీటి సౌకర్యం అందింది. 2014-2024 వరకు టీ(బీ)ఆర్‌ఎస్ ప్రభుత్వం 15లక్షల 81వేఎకరాల వరకు నీటిపారుదల సౌకర్యం కల్పించినట్టు తెలిపింది. మొత్తంగా 46,80,613 ఎకరాలకు నీటి పారుదల సౌకర్యం ఏర్పడింది. మరోవైపు 2023 మార్చి వరకు 27.75 లక్షల పంపుసెట్ల కింద 52 లక్షల ఎకరాలు సాగవుతున్నట్టు ప్రకటించింది.క్రిష్ణానది పరివాహక ప్రాంతమంతా మహారాష్ట్ర, కర్నాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కేంద్రం 1956లో అంతరాష్ట్ర నది జలాల పరిష్కార చట్టం తెచ్చింది. ఆ సందర్భంలో క్రిష్ణా జలాల పంపిణీకి జస్టిస్ ఆర్.ఎస్ బచావత్ ఛైైర్మన్‌గా 1969లో ట్రిబ్యూనల్ ఏర్పాటైంది.ఈ కమిషన్ 1976మే 10న కేంద్రానికి తన తీర్పును సమర్పిస్తూ 2020వరకు ఈ తీర్పు మీద ఎలాంటి విచారణ చేయ రాదని పేర్కొన్నది. ఆ తదుపరి, రాష్ట్రాలు కోరితే స్కీమ్ ‘బి’ ప్రకారం మరో ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలి.
స్కీమ్ (బి) మిగులు జలాల్లో 25శాతం మహారాష్ట్ర, 50శాతం కర్నాటక, 25శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలి. తీర్పు నాటికి రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను గౌరవించి, నిర్మాణం జరిగిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని పరిగణలోకి తీసుకొని 75శాతం నీటి లభ్యత విశ్వసనీయత ఆధారంగా నికర జలాలు 2060 టీఎంసీలు, పునరుత్పత్తి 70 టీఎంసీలు వెరసి 2130 టీఎంసీలుగా నిర్దారించింది. అంతకుపైన జలాలు లభ్యమైతే వరదలొచ్చినా, కరువొచ్చినా నష్టపోయే దిగువ రాష్ట్రం ఏపీ వినియోగించుకోవాలని తెలిపింది. ఆ ప్రకారం మహారాష్ట్రకు 585 టీఎంసీ లు, కర్నాటకకు 734 టీఎంసీలు, ఏపీకి 811 టీఎంసీిలు ప్రకటించింది. తీర్పునాటికి మహరాష్ట్ర 439.65 టీఎంసీలు, కర్నాటక 504.55 టీఎంసీలు, ఏపీ749.16 టీఎంసీలు మొత్తంగా 1693.36 టీఎంసీల నీటి వినియోగం జరుగుతున్నది.
కృష్ణానదికి వచ్చే నీటిలో కర్నాటకలోని తుంగనది పరివాహక ప్రాంతం దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతున్నది.యేటా 430 సెం.మీ నీరు ఈ నది ద్వారానే వస్తుంది. దీన్ని గమనించిన కర్నాటక ప్రభుత్వం తనకు కేటాయించిన 734 టీఎంసీల్లోని వాటాను తుంగ ప్రాంతంలో పెంచుకుని ఆమేరకు భద్ర ప్రాంతంలో తగ్గించుకుని నిర్మించిన ఫలితంగా శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుకు సకాల నీటి ప్రవాహం తగ్గింది. దీనిమీద అప్పటి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఈ ఏడాది వరదలు రావటంతో శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ నుండి నీటిని దిగువకు వదులుతున్నారని కర్నాటక ప్రభుత్వం తుంగభద్ర జలాశయానికి సమాంతరంగా 45 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించతలపెట్టింది.
మిగులు జలాల వివాదంపై కర్నాటక ప్రభుత్వం చేసిన ఫిర్యాదుతో కేంద్రం 2004లో జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన రెండవ ట్రిబ్యునల్‌ను వేయగా నికరజలాలను 75శాతం కాకుండా 65శాతం విస్వసనీయతను పరిగణలోకి తీసుకోని బచావత్ తీర్పుకు అదనంగా147 టీఎంసీలు, పునరుత్పత్తి 16 టీఎంసీలు, మిగులుజలాలు 285 టీఎంసీిలు మొత్తంగా 448 టీఎంసీలు బచావత్ కేటాయింపుకు అదనంగా నిర్దారించింది. మహారాష్ట్రకు 81 కర్నాటకకు 177, ఏపీకి 190 టీఎంసీలు కేటాయింపులు చేసింది. బచావత్ తీర్పు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను పరిగణలోకి తీసుకుని నీటి కేటాయింపులు చేస్తే ఈ ట్రిబ్యూనల్ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 519.24 మీటర్ల వరకు నిర్మించుకోవచ్చని జోతిబసు అధ్యక్షతన ఏర్పడిన నిపుణుల కమిటీ రిపోర్టును కర్నాటకతో సహా అన్ని రాష్ట్రాలు అంగీకరించినదాన్ని సుప్రీంకోర్టు ధృవపరిచింది. అందుకనుగుణంగా కేంద్రం గెజిట్ ప్రకటించినా అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు 524.256 మీటర్ల ఎత్తు వరకు పెంపుతో 303 టీఎంసీల నీటి నిలువకు అవకాశమిచ్చింది. ఇలా అనుమతివ్వడం వలన ఆంధ్రకంటే తెలంగాణకే ఎక్కువ నష్టం జరిగిందని నిపుణుల వాదన. మహారాష్ట్రలోని ”కొహినా”జల విద్యుత్ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ 67.5 టీఎంసీల నీరు కేటాయించగా విద్యుత్ ఉత్పత్తి తర్వాత ఆ నీరంతా అరేబియా సముద్రములో కలుస్తుంది. దీనికి కూడా ఈ ట్రిబ్యునల్ అదనంగా 25 టీఎంసీలు, వెరసి 92.5 టీఎంసీలు కేటాయించింది. మరోవైపు మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు క్రిష్ణబేెసిన్‌లో నిర్మించాలనుకున్న వాటికి నీటి కేటాయింపులు చేయాలని కోరాయి. ఏపీ ప్రభుత్వం క్రిష్ణా, బేసిన్‌లో ఉన్న తెలంగాణ పాజెక్టులు ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి, బీమా 1,2 దశలు నెట్టెంపాడు, కోయిల్ సాగర్, పెన్నా నది బేసిన్‌లో ఉన్న ఎస్‌ఆర్‌బిసి, గాలేరు-నగరి, హంద్రీ -నీవా, వెలిగొండ ప్రాజెక్టుల వివరాలిచ్చి క్రిష్ణాబేసిన్ కాకుండా పెన్నాబెసిన్‌కు నీటి కేటాయిం పులు చేయాలనే డిమాండ్‌ను నిరాకరించిన ట్రిబ్యునల్ కర్నాటకకు అదనంగా నీళ్లు కేటాయించింది.
జీవో నెంబర్ 69/96 ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 834అడుగులు ఉండాలని నిర్ణయించింది. ఇది 2004 వరకు అమల్లో ఉంది. రాయలసీమ విద్యుత్ ఉత్పత్తికి 4500 క్యూసెక్కుల నీరు వినియోగించిన తర్వాత మాత్రమే ఇరిగేషన్‌కు వినియోగం జరిగేది. 2004లో 107జీవో పేరుతో శ్రీశైలం నీటి మట్టం 834 నుండి 854 అడుగులకు పెంచుతూ అనుమతినిచ్చారు. 841 అడుగుల నుండి 11వేల క్యూసెక్కుల నీటిని తరలించటానికి పూనుకున్నారు. రెండేండ్లు గడవకముందే 2006లో జీవో 3 పేరుతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుండి 11వేల క్యూసెక్కుల నుండి 44వేల క్యూసెక్కులకు పెంచారు. తదుపరి, 2020లో జీవో 203 పేరుతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడుకు సమీపంలో సంగమేశ్వరం వద్ద (రోజుకు 3 టిఎమ్‌సిల చొప్పున తరలిస్తున్నారు) 80వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రాజెక్టును పూర్తిచేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో (క్యారీ ఓవర్) రాబోయే పంటలకు నిలువ 150 టీఎంసీలు పెట్టాలని తెలిపిన ఆచరణకు దిక్కులేదు. పాత కర్నూల్ జిల్లాలోని ముచ్చుమర్రి వద్ద క్రిష్ణానదిలో +797 అడుగుల వద్ద మోటర్లు బిగించి రోజుకు అర టీఎంసీ చొప్పున నీటిని తరలిస్తున్నారు.
2015లో ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల్లో బచావత్ ట్రిబ్యునల్‌ను పరిగణలోకి తీసుకోకుండా వినియోగించుకున్న నీటి ఆధారంగా ఏడాది వరకే అని తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కి 512 టీఎంసీలుగా 37:63 నిష్పత్తి ప్రకారము నీటివరకు కేటాయిస్తూ వస్తున్నది. క్రిష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో 31.5 శాతం ఉంది.
పోలవరం నుండి క్రిష్ణాబేెసిన్‌కు 80టీఎంసీలు మళ్లింపు ప్రణాళిక చేసి 80కి బదులు 110 టీఎంసీలు మళ్లించారు. బేసిన్ మారిన ఫలి తంగా క్రిష్ణా బేసిన్ ఎగువ రాష్ట్రాలకు 45 టీఎంసీలివ్వాలి. ఆ నీటిని తెంగాణకు కేటాయించాలి. అదేవిధంగా పెన్నా బేసిన్‌కు కూడా క్రిష్ణానీటిని 95 టిఎంసీల వరకు తరలించారు. ఆ మేరకు పరిగణనలోకి తీసుకోని మిగులు జలాల్లో తెలంగాణ వాటాను రాబట్టటానికి పూనుకోవాలి. పరివాహక ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాన్ని పరిగణించి నీటి కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
బ్రిజేష్‌కుమార్ ట్రిబునల్ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేస్తూ తీర్పునివ్వాలి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలి. జూరాలపై గల నెట్టెంపాడు(22 టిఎంసీలు), శ్రీశైలంపైన ఉన్న కల్వకుర్తి, (40 టిఎంసీలు) పాలమూరు ఎత్తిపోతల (120 టిఎంసీలు) కేటాయించాలి. ఉమ్మడి రాష్ట్ర నీటిలో తెలంగాణ వాటాను రాబట్టుకోవటంలోనే దక్షిణ తెలంగాణ భవిష్యత్ ఆధారపడి ఉంది. పాలకులు ఆ వైపు దృష్టి సారించాల్సిన అవసరమున్నది.
బొంతల చంద్రారెడ్డి
9490098005