ఎన్నికల కమీషన్ ఆదేశానుసారం అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెక్ పోస్టులలో సీఆర్పీఎఫ్ బలగాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. శనివారం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధుల్లో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని,184 పోలింగ్ కేంద్రాల్లో,124 రూట్ లలో లో ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న అదనపు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.గడిచిన 10 రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన రూ. 44 లక్షల్లో రూ.34 లక్షల ను ఆధారాలు చూపిన యజమానులకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బృందం సభ్యులు నగదును అందజేయడం జరిగిందని స్పష్టం చేశారు. పట్టుబడిన నగదు 90 శాతం కాగా మరో 10 శాతం ఆధారాలతో హాజరు కాలేదని ఆయన తెలిపారు.మండలంలో సమస్యాత్మక గ్రామాలైన కన్నాయిగూడెం,గాండ్లగూడెం, కావడిగుండ్ల లో అదనపు నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట ఎస్.హెచ్.ఒ లు ఎస్సైలు శ్రీకాంత్, సందీప్ కుమార్, శివరామకృష్ణ,హెచ్.సి, పి.సి లు పాల్గొన్నారు.