మావోయిస్టుల పథకాలపై నిఘా

– బస్తర్‌లో శాంతియుత ఓటింగ్‌ కోసం విశ్వ ప్రయత్నం
– ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు 80 వేల మంది సైనికులు సంసిద్ధం
– ప్రతీ 19 మంది ఓటర్లకు ఒక సైనికుడు
– నిఘా నీడలో దండకారణ్యం
– నూతన పోలింగ్‌ స్టేషన్లు సైతం ఏర్పాటు
నవతెలంగాణ-చర్ల
ఈనెల 19 నుండి జూన్‌ 1వ తారీకు వరకు దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మావోయిస్టుల విద్వాంస పథకాలపై పోలీసు బలగాలు నిఘాను కట్టుదిట్టం చేశాయి. మావోయిస్టుల ఎత్తులకు పై ఎత్తు లేస్తూ పోలీసు బలగాలు దూసుకుపోవడానికి సంసిద్ధమవుతున్నట్లు సమాచారం. సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు 7 దశల్లో ఓటింగ్‌ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఫలితం రానుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని 11 స్థానాలకు మూడు దశల్లో ఓటింగ్‌ జరగనుంది. మొదటి దశలో రాష్ట్రంలోని ఏకైక స్థానమైన బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటింగ్‌ జరగనుంది. బస్తర్‌ అత్యంత సున్నితమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. మావోయిస్టుల సమస్య ఉన్న ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో తొలి దశలోనే భారీ బందోబస్తులో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బస్తర్‌లో మావోయిస్టులు రక్తపాతం సృష్టించారు. బస్తర్‌లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మావోయిస్టులు తమ కుటిల పథకాలను అమలు చేయడం గమనార్హం. బస్తర్‌లో ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు ప్రజాస్వామ్య పండుగను బహిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. దానికి అవిధేయత చూపేవారిని టార్గెట్‌ చేయడానికి వారు వెనుకడుగు వేయరు. ఎన్నికల సమయంలో, మావోయిస్టులు ప్రజా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది పోలింగ్‌ పార్టీలు లేదా అమాయక గ్రామస్థులను లక్ష్యంగా చేసుకుంటారు. బస్తర్‌లో ఎన్నికల సమయంలో హింస సర్వసాధారణం. బస్తర్‌ ఎన్నికల చరిత్రలో ఓటింగ్‌ సమయంలో మావోయిస్టులు కోసం ఇప్పిన పాము వలె బుసలు కొడుతూ చాలా చోట్ల రక్తం చిందించారు. ఈ క్రమంలో 2013 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పరివర్తన్‌ యాత్రపై మావోయిస్టులు దాడి చేశారు. ఇందులో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు మరణించారు. 30 మంది వరకు కాంగ్రెస్‌ నాయకులు మరణించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దంతెవాడలో బీజేపీ ఎమ్మెల్యే బీమా మాండవి కాన్వారుపై దాడి జరిగింది. ఇందులో ఎమ్మెల్యేను మందుపాతరతో హత్య చేశారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మావోయిస్టులు ఎలాంటి నేరాలకు పాల్పడలేదు. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి భయాందోళనలు రేపేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో బస్తర్‌లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేస్తున్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించేందుకు భద్రతా విభాగం సన్నాహాలు ప్రారంభించింది. బస్తర్‌ లోక్‌సభ పార్లమెంటరీ స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని అసెంబ్లీ స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. ఇలాంటి పరిస్థితుల్లో బస్తర్‌లో మోహరించిన సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్టీఎఫ్‌, డీఆర్జీ సైనికులతో పాటు ఎన్నికల సంఘం అదనపు బలగాలను కూడా పంపనుంది.
శాంతియుత ఓటింగ్‌ కోసం మోహరించనున్న 80 వేల మంది సైనికులు
బస్తర్‌ లోక్‌సభ స్థానంలో శాంతియుతంగా ఓటింగ్‌ నిర్వహించేందుకు 80 వేల మంది సైనికులకు కమాండ్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇవ్వనున్నారు. బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 1,46,6337 మంది ఓటర్లు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, 19 మంది ఓటర్ల వెనుక ఒక భద్రతా సిబ్బందిని మోహరిస్తారు. దీంతో పాటు కొత్త క్యాంపులు ప్రారంభించిన బస్తర్‌లోని అంతర్గత ప్రాంతాల్లో కూడా ఈసారి ఓటింగ్‌ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, బయటి నుంచి బస్తర్‌ కు వచ్చే వారిపై నిఘా ఏర్పాటు చేసి భద్రతా బలగాలను మోహరించేందుకు కృషి చేస్తామని బస్తర్‌ ఐజీ సుందర్‌ లాల్‌పి తెలిపారు. వరుస ఎన్‌కౌంటర్లతో దండకారణ్యం దద్దరిల్లుతూ ఉంటే ప్రతీకర చర్యతో రగిలిపోతున్న మావోయిస్టులు ఏ సమయంలో ఎటు నుండి విరుచుకుపడతారో అర్థం కాని సందిగ్ధంలో ఆదివాసీ గ్రామాల్లో ఉన్న గిరిజనలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

Spread the love