
గత నెల రోజుల నుండి జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక పట్ల కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మర ఎన్నికల ప్రచారాలతో కసరతులు చేశాయి. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఈనెల 13న జరగగా ఎన్నికలు ముగియగానే ఆయా పార్టీల హై కమాండ్ గెలుపు ఓటమిలపై అంచనాల సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ సెగ్మెంట్లో ఏ పార్టీ కి ప్రజలు మొగ్గు చూపారు అనేది మూడు పార్టీల నాయకులు మండలాల వారీగా నాయకులతో ఏ మండలంలో ఏ పార్టీకి ఏ గ్రామంలో ఏ పార్టీకి ప్రజలు ఓటు వేశారు, మన పొజిషన్ ఎలా ఉంది అనేది సర్వే అంచనాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో జుక్కల్ సెగ్మెంట్లో ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఎన్నికలు జరిగినట్లు జోరుగా చర్చలు వినబడుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని చర్చలు వినబడుతున్నాయి. జుక్కల్ సెగ్మెంట్లో గెలుపు ఏ పార్టీది అనేది అంచనాలు వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలు పోటాపోటీగా ఓట్లు వేసినట్లు వినబడుతున్న చర్చలు గెలుపు ఎవరిది అనేది ఓట్లు లెక్కింపు జరిగే వరకు జుక్కల్ సెగ్మెంట్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏ అభ్యర్థికి ఓట్లు అధికంగా వచ్చాయి అనేది ప్రస్తుతం చర్చల మూలంగా పక్కగా చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల పై ఎక్కడ చర్చలు జరుపుతున్నారో కానీ బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు జరిగిన జుక్కల్ సెగ్మెంట్లో ఏ మండలంలో ఎలాంటి పరిస్థితి కొనసాగింది అనే దానిపై ఆ పార్టీ జుక్కల్ సెగ్మెంట్ ఇన్చార్జ్ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే బిచ్కుంద లో తమ పార్టీ కార్యాలయంలో మండలాల వారీగా నాయకులతో సర్వే అంచనాల కోసం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జుక్కల్ సెగ్మెంట్లోని మద్నూర్ డోంగ్లి మండలాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు వాట్సాప్ లో వచ్చిన సమావేశపు ఫోటోలను చూసి ఈనెల 13న జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో నాయకులతో అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ప్రజల నాడి ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేది లెక్క కట్టలేని పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి. లోన లొటారం బయట పేటారం అన్న చందంగా ఈనెల 13న జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో జుక్కల్ సెగ్మెంట్లో బయట చూస్తే కాంగ్రెస్ ప్రభంజనం లోపల నుండి బీజేపీ ప్రభంజనం అనే విధంగా చర్చలు జోరుగా వినబడుతున్నాయి. ఇలాంటి చర్చలు ఎవరి గెలుపుకు ముగ్గు చూపుతాయో జూన్ 4 న జరిగే ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాలి.