గృహహింస నుండి బయటపడింది… రైతుగా స్థిరపడింది


చిన్నతనంలోనే పెండ్లి. నలుగురు పిల్లలకు తల్లి. మద్యానికి బానిసైన భర్త. అతను పెట్టే చిత్రహింసలు. పిల్లలకు తిండి పెట్టలేని దుస్థితి. ఇవన్నీ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ ఆశ కోల్పోలేదు. పిల్లల కోసం ఏదో చేయాలనే తపన. వారికి మంచి భవిష్యత్‌ ఇవ్వాలనే కోరిక. వినూత్న ఆలోచనలకు నాంది పలికాయి. వ్యవసాయ వ్యవస్థాపకురాలిగా ఆమెను మార్చాయి. ఆమే కన్పూర్‌కు చెందిన దులోరిన్‌. ఈ మహిళా రైతు సాధించిన విజయాలేంటో మనమూ తెలుసుకుందాం…

మార్పు తీసుకురావాలనే సంకల్పం

రాత్రిపూట భర్త చేతిలో దెబ్బలు తింటూనే పగలు ఎనిమిది మంది కుటుంబ సభ్యుల కడుపు నింపడం కోసం దులోరిన్‌ కష్టపడేది. తనకున్న కొద్దిపాటి భూమిలో వరిపంటను పండించేది. అలాగే దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగించింది. కానీ ఆమె కష్టం కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. రోజంతా కష్ట పడి ఖాళీ కడుపుతో మంచంపై పడిపోయేది. 2020 ఆమె జీవితం ఓ మలుపు తిరిగింది. దులోరిన్‌ జీవితంలో కొంత మెరుగుదల ప్రారంభమయింది. ఆమె స్థానిక స్వయం సహాయ బృందంలో చేరింది. సామూహిక బలం, పురోగతి, సాధికారత కోసం ఆ బృందం పని చేస్తుంది. అప్పటి వరకు తాను పడిన కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆమెకు కొంత ఊరట లభించింది. అతి తక్కువ కాలంలోనే విస్తృతమైన సంకల్పంతో నడిచే వ్యక్తిగా ఉద్భవించింది
ముఫ్పై ఐదేండ్ల దులోరిన్‌ మార్కమ్‌, నిర్మల్‌ అనే వ్యక్తిని 16 ఏండ్ల వయసులో వివాహం చేసుకుంది. నూతన వధువు తన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఛత్తీస్‌గఢ్‌లోని కస్పూర్‌ గ్రామానికి వచ్చింది. వరుసగా నలుగురు పిల్లలకు తల్లి అయ్యింది. భర్త మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ బాధ్యతల ఒత్తిడి ఆమెపై పడింది. వ్యసనం కారణంగా భర్త కూలి పనులు వెళ్లేవాడు కాదు. పైగా మత్తులో మునిగి భార్యను నిత్యం కొట్టేవాడు. ఆమె ఏడుస్తుంటే ఆనందించేవాడు. 2010లో నిర్మల్‌కు మానసిక ఆరోగ్యం క్షీణించింది. అందరూ అతన్ని ”పిచి” అని పిలిచేవారు. ”నేను నా భర్తను గొలుసులతో కట్టివేయాలి. లేకపోతే అతను మానసిక అనారోగ్యం కారణంగా నన్ను కొట్టేవాడు. అంతకన్నా నాకు వేరే మార్గం లేదు” అంటూ ఆమె తన బాధను పంచుకుంది. వైద్యం తర్వాత అతని ఆరోగ్యం కొంత మెరుగుపడింది. కానీ 2016లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఆమెకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి.
వ్యవసాయం మెరుగుపరుకుంది
స్వయం సహాయ బృందం నిర్వహించే శిక్షణలో పాల్గొంది. అది ఆమెకు వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడంలో సహాయపడింది. సహజసిద్ధమైన ఎరువులు, జీవామృతం, బ్రహ్మాస్త్ర వంటి క్రిమిసంహారక మందుల తయారీ, వాడే విధానం గురించి తెలుసుకుంది. వాటిని తన సొంత పంటకు వినియోగించాలని నిర్ణయించుకుంది. అది వరి సాగులో ఎంతో ఉపయోగపడింది. ఆమెకే కాదు మిగిలిన వారికి కూడా మునుపెన్నడూ చూడని ఫలితాలను ఇచ్చింది. గతంలో కేవలం 36 క్వింటాళ్లు మాత్రమే పండే భూమిలో ఆ ఏడాది ఆమె భూమిలో 52 క్వింటాళ్ల వరి దిగుబడి వచ్చింది. అప్పటి నుండి దులోరిన్‌ తను సంపాదించిన ప్రతి అదనపు పైసాను పొదుపు చేసింది. తన పెద్ద కుమార్తెను 200 కి.మీ దూరంలో ఉన్న జగదల్‌పూర్‌లోని పాఠశాలలో చేర్పించింది. గత రెండేండ్ల తన కలను నెరవేర్చుకుంది. తన పిల్లలకు చదువు చెప్పించడంలో ఈ తల్లి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ ఉండేది.
కూరగాయలపై దృష్టి పెట్టి…
దులోరిన్‌ దూరదృష్టితో వరితో పాటు కూరగాయల సాగులో కూడా శిక్షణ తీసుకుంది. ఇది తనకు కొంత శ్రమ, ఖర్చుతో కూడుకున్నదని తెలుసు. కానీ ఇవన్నీ చేయడానికి ఆమెకు ఇంకా మూడు ఎకరాల భూమి ఉంది. అందుకే కొత్త సాగు పద్ధతులపై దృష్టి పెట్టింది. తన ఇంటి పక్కన ఉన్న చిన్న భూమిలో మిరప నారులను తయారు చేసి నాటింది. దీనికి ఆమె ప్రారంభ పెట్టుబడి రూ.1,800. అయితే రూ.9,600 సంపాదించింది. తర్వాత బీన్స్‌, పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా నాటింది. ఏండ్ల తరబడి సాగుకు నోచుకోని భూమి ఇప్పుడు సారవంతమయింది. ఆమె తన జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకో లేదు. తన తోటి సభ్యులకు కూడా వీటిపై అవగాహన కల్పించింది. ”నా పరిస్థితిని చూసి నా పిల్లలు ఎప్పుడూ చదువు మానేసి నాతో కలిసి పనికి వెస్తామని చెబుతుంటారు. కానీ నేను దానికి ఒప్పుకోను. నా పిల్లల చదువు కోసం నేను ఎంత కష్టమైనా చేస్తాను” అని ఆమె అంటున్నారు.
చేపల పెంపకం మొదలుపెట్టి…
ఆదాయం పెంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను చూసిన తర్వాత దులోరిన్‌ తన ప్రయత్నాలను ఆపలేదు. తన గ్రామంలో ఒక ఫామ్‌ పాండ్‌ ప్లాన్‌ చేయడాన్ని చూసింది. తను కూడా చేపల పెంపకం మొదలుపెట్టాలని భావించింది. వెంటనే తెలిసిన వారి భూమిని చెరువు తవ్వడానికి తీసుకుంది. ప్రధాన్‌ సిబ్బంది 2 కిలోల ఫింగర్లింగ్స్‌ (బేబీ ఫిష్‌) కొనుగోలు చేయడంలో ఆమెకు సహకరించారు. అలా పెంచిన చేపలను అమ్మి మంచి ఆదా యాన్ని పొందుతుంది. ఇవన్నీ ఆమె ఎవరి సహాయం లేకుండా తనే స్వయంగా నిర్వహిస్తుంది. నిర్మల్‌ ఇప్పటికీ దాదాపు రోజంతా గొలుసులతో కట్టి వేయబడి ఉంటాడు. వివిధ వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి ఆమె ఇతర గ్రామాలకు వెళ్లేది. అక్కడ చూసి బిందు సేద్యం పద్ధతులను నేర్చుకుంది. దానితో కస్పూర్‌లోని 2.5 ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చింది.
శిక్షణ కోసం పిలుస్తున్నారు
పెండ్లి తర్వాత ఇంత సంపాదిస్తానని దులోరిన్‌ ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఆమె వ్యవసాయ వ్యవస్థాపకురాలు. అన్ని గ్రామాల నుండి ప్రజలు తమ పంటలను మెరుగుపరచడానికి, వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి శిక్షణ కోసం ఆమెను పిలుస్తున్నారు. ”ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ శిక్షణ ద్వారా కూడా నేను కొంత డబ్బు సంపాదిస్తున్నాను” ఆమె గర్వంగా చెబుతుంది. సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతనే కుటుంబ సభ్యులు తనను గౌరవించే వారని ఆమె అంటున్నారు.
ఆశ ఎప్పుడూ కోల్పోలేదు
భర్త మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఆమె తదుపరి లక్ష్యం. ఇప్పటివరకు ఆమె కోసం అతను ఏమీ పని చేయలేదు. ఆమె ప్రయత్నాలు, విజయాల్లో అతని భాగస్వామ్యం ఏమీ లేదు. కానీ దులోరిన్‌ ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. అతనికి తగిన సహాయం, చికిత్స అందించి పూర్తిగా నయమయ్యేలా చూడాలని బలంగా కోరుకుంటుంది. భర్త విషయంలో కూడా ఆమె విజయం సాధించాలని నిశ్చయించుకుంది.

Spread the love