– ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకున్న రైల్వేపోలీసులు
ముంబయి: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో అతడిని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా నిందితుడిని పట్టుకుని, వీడియో కాల్ ద్వారా ముంబయి పోలీసులతో మాట్లాడి, అతడేనని ధ్రువీకరించుకున్నారు. రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తీసుకొచ్చేందుకు ముంబయి పోలీసులు బయలుదేరి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్నారు.
గురువారం సైఫ్‌పై ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి యత్నించాడు. సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఆయన సైఫ్ అని తెలీదు : ఆటో డ్రైవర్
తన ఆటోలో లీలావతి ఆస్పత్రికి తరలించిన వ్యక్తి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ అనే విషయం తనకు తెలియదని డ్రైవర్ భజన్ సింగ్ చెప్పారు. ఖర్ (ఈస్ట్)లోని పైప్‌లైన్ రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న భజన్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ రక్తస్రావంతో గాయపడిన వ్యక్తిని దగ్గరి దారిలో ఆస్పత్రికి తీసికెళ్లి ప్రాణాలు కాపాడేలా చేయాలన్నదే తన ఆలోచన అని, ఆయన ఓ సెలబ్రిటీ అనే విషయం తనకు అప్పుడు తెలియదని చెప్పారు. ఆటోలో సైఫ్ స్పృహలోనే ఉన్నారని, ఆస్పత్రికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందని పదే పదే ప్రశ్నించారని తెలిపారు. ‘రెండు నిమిషాలు పడుతుందని నేను చెప్పాను. సైఫ్ వెంట ఆయన కుమారుడు తైమూర్, సహాయకుడు హరి ఉన్నారు. ఆయన భయపడడం లేదు. అయితే ఆయన బట్టలన్నీ రక్తంతో తడిసిపోయాయి. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి బాలీవుడ్ నటుడని మొదట్లో నాకు తెలీదు. సాధ్యమైనంత త్వరగా లీలావతి ఆస్పత్రికి చేరుకోవాలన్నదే నా లక్ష్యం. వారు అలాంటి అత్యవసర పరిస్థితిలో ఉన్నారు. ఆటో బీవర్జీ అడగకుండా నన్ను అడ్డుకున్నారు కూడా. వాస్తవమేమంటే…అలాంటి పెద్ద నటుడు నా వాహనంలో కూర్చోవడమే నాకు పెద్ద సంతృప్తి’ అని భజన్ సింగ్ వివరించారు.