నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్టు తెలిపారు. చిన్నచిన్న కారణాలతో 1500 మందిని ఉద్యోగాల నుంచి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముగ్గురికి పోలీసులు అనుమతి ఇచ్చారు.