ఆద్యంతం ఉత్కంఠ

– ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారంటూ ప్రచారం
– రెచ్చగొట్టేలా బండి కామెంట్లు
– తెలంగాణ భవన్‌ వద్ద ఆయన దిష్టిబొమ్మ దగ్ధం
– రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నం
– మోడీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఢిల్లీలో ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ సందర్భంగా రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యకర్తలు పెద్దఎత్తున హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అగ్గికి ఆజ్యంపోసినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడటంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బండి సంజరును అరెస్టు చేయాలంటూ రోడ్లపైకి వచ్చారు. తెలంగాణ భవన్‌ వద్ద ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు బండి సంజరు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు వారికి మధ్య పెనుగులాట జరిగింది. మోడీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈడీ విచారణానంతరం ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో మంత్రులు టీ హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ముందురోజే (శుక్రవారం) ఢిల్లీకి వెళ్లారు. కవితను అరెస్టు చేస్తే రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో ఆందోళనలు చేయాలనే వ్యూహంతో వెళ్లినట్టు సమాచారం. మరోవైపు ప్రగతి భవన్‌ వద్దకు భారీగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్తత ఏర్పడింది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఎప్పటికప్పుడు ఆరా తీసారు. రాత్రి 7 గంటల సమయంలో కవితను అరెస్టు చేయట్లేదని ఢిల్లీలోని ఈడీ కార్యాలయం మీడియాకు లీకులు ఇచ్చింది. దీనితో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Spread the love