రూ.71 కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీలో స్వచ్ఛ బడి : మంత్రి కేటీఆర్

నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దార్శనికత కారణంగానే 9 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నది. కేసీఆర్ నాయకత్వంలో పరిశ్రమలు, భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు ఇవ్వడం చాలా గొప్ప విషయం. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అన్ని రంగాల్లో తెలంగాణ పునరాగమనంలో ఉన్నదని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి వేడులకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.71 కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీలో స్వచ్ఛ బడిని ప్రవేశపెడుతున్నాము. ఈ బడి ద్వారా తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసే విధానం.. కంపోస్టు ఎరువును ఎలా తయారు చేయాలనే అంశాలపై యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. స్వచ్ఛ బడి కాన్సెప్ట్‌ను సిద్దిపేటలో ప్రారంభించిన దీప్తిని.. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంట్‌గా నియమిస్తున్నట్లు వేదిక మీద ప్రకటించారు. ఈ స్వచ్ఛ బడి కార్యక్రమాన్ని అందరు మున్సిపల్ కమిషనర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించారు. ఏక కాలంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టడంతో రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి సాధించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Spread the love