– ఘాటుగా హైకోర్టు వ్యాఖ్యలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూదాన్ భూముల్ని అధికారులు అమ్ముకుని తినేశారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నిజాం కాలంలోనూ ఈ తీరుగా చేయలేదని కూడా పేర్కొంది. పేదల కోసం ఎంతోమంది భూముల్ని దానంగా ఇస్తే అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. భూములను కాపాడే ధర్మకర్తలుగా ఉండాల్సిన అధికారులే అధర్మం వైపునకు అడుగులు వేశారని తప్పుపట్టింది. భూదాన్ భూములంటూ ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను అప్పీలెట్ ట్రైబ్యునల్ అథారిటీగా ధృవీకరించిన వ్యక్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వారసత్వ ధృవీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. నిజాం కూడా భూములను అలా కట్టబెట్టలేదనీ, భూములను దివానీ, పట్టా భూములుగా కేవలం మూడు రకాలుగా గుర్తించిన నిజాంను కొనియాడాలని వ్యాఖ్యానించింది. గత కలెక్టర్‌పై ఇప్పటికే పలు కేసుల విచారణను ఎదుర్కొంటున్నట్టుగా పత్రికల్లో వార్తలు చదివామనీ, ఆరోపణలకు అధికారులు జవాబు చెప్పి తీరాలని తేల్చి చెప్పాలని సుప్రీం కోర్టు, సయ్యద్ యాకూబ్ కేసుల్లో జారీ చేసిన మార్గదర్శకాలను కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను ఇవ్వగా అమ్ముకుని తినేశారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో పేదలకు భూములను ఇచ్చిన ఎందరో గొప్పవాళ్లున్నారనీ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అగ్రికల్చరల్ సీలింగ్ చట్టం అమల్లోకి వచ్చినపుడు 500 ఎకరాలు ఇచ్చారని కొనియాడింది. భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతో సహా అధికారులందురూ విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో 10 ఎకరాల భూమి భూధాన్ బోర్డుకు చెందిందని ధృవీకరించాక వారసత్వ ధృవీకరణ పత్రం ఎలా జారీ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూదాన్ యజ్ఞ బోర్డ్డు, వ్యక్తిగత హోదాలో గత కలెక్టర్ డి. అమోరు కుమార్, ఆర్‌డీవో ఆర్.పి. జ్యోతి సహా మరో ఇద్దరు ప్రయివేటు వ్యక్తులకు నోటీసులను జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నెం 182 లో 10.29 ఎకరాలకు ఖాదర్ ఉన్నీసా బేగంకు వారసత్వ ధృవీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆ భూమిలో వాటా ఉన్న నవాబ్ పూర్ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి గురువారం విచారణ జరిపారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.