మట్టినీ మింగుతుండ్రు

– వాల్టా చట్టానికి మాఫియా తూట్లు
– అనుమతి గోరంత.. తవ్వేది కొండంత..
– అసైన్డ్‌, పట్టా భూముల్లో తవ్వకాలు
– చోద్యం చూస్తున్న ప్రభుత్వ శాఖలు
– స్థిరాస్తి వ్యాపారుల వెంచర్లు, ఇండ్లు, అపార్ట్‌మెంట్లకు తరలింపు
– కరిగిపోతున్న నీటి వనరులు, గుట్టలు, చెట్లు
మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. అనుమతుల్లేకుండా ప్రభుత్వ, ప్రయివేట్‌ భూముల్లో మట్టిని తవ్వేస్తున్నది. చెరువులు, కుంటల్ని సైతం విడిచిపెట్టట్లేదు. ప్రాజెక్టుల కింద తవ్విన కాల్వ మట్టిని ఎత్తుకెళ్తున్నది. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి కోట్లు సంపాదిస్తున్నది. స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు, ఇండ్లు, ఫంక్షన్‌ హాల్స్‌, గోదాములు ఇతర నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నా మైనింగ్‌, భూగర్భజల, రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ శాఖల మధ్య సమన్వయలోపం వల్ల అడ్డుకట్ట వేసే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్లు, ఇతర నిర్మాణాల పేర గోరంత అనుమతి పొంది కొండంత మట్టిని అక్రమంగా తవ్వుకెళ్తున్నారు. జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి రాత్రింబవళ్లూ మట్టిని తోడేస్తుండటంతో నీటి వనరులు, గుట్టలు, కాల్వ కట్టలు, చెట్లు తరిగిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇలాంటివి యథేచ్ఛగా జరిగినా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఆ ఆలుసుతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమూ తమను ఏమీ చేయలేదన్న కారణంతో ఇలాంటి వాటికి పాల్పడుతున్నారన్న చర్చ మొదలైంది.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా మట్టి మాఫీయా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ మూడు జిల్లాల్లోని అనేక మండలాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో బుదేరా, గొర్రెగట్టు, కంకోల్‌, లింగంపల్లి గ్రామాల నుంచి మట్టిని తవ్వి ముంబయి హైవే వెంట వెలుస్తున్న వెంచర్లకు తరలిస్తున్నారు. సదాశివపేట ప్రాంతంలో విస్తరిస్తున్న వెంచర్లకు మట్టిని తోడుతున్నారు. గ్రామాల్లో జేసీబీలు పెట్టి తవ్వుతూ టిప్పర్లు, ట్రాక్టర్లతో రాత్రింబవళ్లూ తరలిస్తున్నారు. చెరువుల్ని తలపించే లా తవ్వుతూ గుంతలమయం చేస్తుండటంతో సారవంతమైన నేలలు ధ్వంసమవుతున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. ఈ మట్టి దందాను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. కొండాపూర్‌, సంగారెడ్డి, కంది, వట్‌పల్లి, ఝరాసంఘం, రాయికోడ్‌, హత్నూర, పుల్కల్‌, చౌటకూర్‌, నారాయణఖేడ్‌, పెద్దశంకరంపేట వంటి మండలాల్లోని వందలాది గ్రామాల్లో ఈ మట్టి దందా జోరుగా సాగుతోంది. నారాయణఖేడ్‌ ప్రాంతంలో చెరువులు, కుంటల్ని సైతం తవ్వేస్తున్నారు. జిన్నారం, గుమ్మడిదల, బొల్లారం, బొంతపల్లి ప్రాంతాల్లోని గుట్టలన్నీ కరిగిపోయాయి. అసైన్డ్‌, ప్రభుత్వ భూములన్నీ మట్టి తవ్వకాలకు కేంద్రాలుగా మారాయి. ఝరాసంగం మండలంలోని కుప్పానగర్‌, మాచునూరు, కల్లూరు, చిల్లెపల్లి, ఏడాకులపల్లి, చిలుకపల్లి, గినియార్‌ వంటి గ్రామాల్లోని ప్రభుత్వ
భూముల్ని టార్గెట్‌ చేసి ఎర్రమట్టిని తరలిస్తున్నారు. హైదరాబాద్‌-ముంబయి జాతీయ రహదారి వెంట పటాన్‌చెరు నుంచి బీదర్‌ వరకు రెండు వైపులా వందలాది ఎకరాల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. అనేక నిర్మాణాలు జరుగుతుండటంతో కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు తెలిసింది. సిద్దిపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ కాల్వల మట్టిని సైతం మట్టి మాఫీయా తవ్వుకెళ్లినా అధికారులకు పట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే నంగునూరు ప్రాంతంలో మెదక్‌ జిల్లాలోని కొల్చారం, నర్సాపూర్‌, శివంపేట, కౌడిపల్లి మండలాల్లోని గుట్టలు, అసైన్డ్‌ భూములు, అటవీ ప్రాంత భూముల్లో మట్టి తవ్వకాలు గుట్టుగా సాగుతున్నాయి.
అవసరాన్ని బట్టి మారే ట్రాక్టర్‌ మట్టి ధర
గ్రామాల్లో ఒక ట్రాక్టర్‌ మట్టి ధర రూ.1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తారు. అదే పెద్దపెద్ద వెంచర్లకు, హైవేల మీదుగా ట్రిప్పర్ల ద్వారా పంపుతారు. వాటికి రూ.5 వేల వరకు వసూలు చేస్తారు. అవసరాన్ని బట్టి 100 నుంచి 200 ట్రిప్పుల మట్టి కావాలని వ్యాపారులతో వెంచర్ల యజమానులు మాట్లాడుకుంటారు. దాన్ని బట్టి తవ్వకాలు ఉంటాయి. అంతేకాదు, ధర ఎప్పుడూ ఒకేలా ఉండదు. అవసరాన్ని, సందర్భాన్ని, దూరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా చేసే చీకటి వ్యాపారం కాబట్టి.. పోలీసులకు, ఇతర అధికారులకు, చోటామోటా నేతలకు మామూళ్ల రూపంలో ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ధర వీటిపై కూడా ఆధారపడి ఉంటుంది.
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
మట్టి, ఇసుక, చెట్ల రవాణా పనులు వాల్టా చట్ట పరిధిలో అనుమతులు పొంది చేయాల్సినవి. కానీ..! అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నది. వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రయివేట్‌ భూముల్లోంచి మట్టిని తవ్వి తరలించాలంటే ముందస్తుగా అనుమతులు పొందాలి. మట్టి తవ్వకాలు చేయాల్సి వస్తే హెక్టారుకు రూ.50 వేలు చెల్లించాలి. విక్రయాలపై 2.25 శాతం పన్ను చెల్లించాలి. ఇండ్ల నిర్మాణాలకు, తక్కువ మొత్తంలో అవసరమున్న వాటికి తహసీల్దార్‌ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి.
తర్వాత మీ సేవ ద్వారా గనులు, భూగర్భ జల శాఖకు దరఖాస్తు చేయాలి. ఒక నెల వరకు మట్టిని తవ్వేందుకైతే జిల్లా కలెక్టర్‌ అనుమతి పొందాలి. అంతకు ముందే భూగర్భ, మైనింగ్‌, కాలుష్య నియంత్రణ బోర్డు, ఆర్డీఓ, డీఎఫ్‌ఓ, తహసీల్దార్‌ అనుమతులు పొందాలి. కలెక్టర్‌ నుంచి అనుమతి రావాలంటే వీళ్లంతా మట్టిని తవ్వే స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలి. ఇంత వ్యవహారం ఉన్నప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదు. పెద్ద కంపెనీలు, గోదాములు, వెంచర్లు వేసే వాళ్లు కొద్దిపాటి మట్టి కోసం స్థానిక తహసీల్దార్ల అనుమతి ఉందని చెప్పి గుట్టల్ని తవ్వేస్తున్నారు.
అనుమతుల్లేకుండా మట్టి తవ్వకాలు చేస్తే చర్యలు: విజరుకుమార్‌, ఏడీ మైనింగ్‌
అనుమతుల్లేకుండా మట్టిని తవ్వితే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో మట్టి తవ్వకాల సమాచారం తెల్సిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. గుట్టలు, కాల్వ కట్టలు, ప్రభుత్వ భూముల్లో మట్టిని తవ్వితే ఉపేక్షించేది ఉండదు. ప్రయివేట్‌ భూముల్లోనే అనుమతులు లేకుండా మట్టి తవ్వొద్దు.

Spread the love