స్వామినాథన్‌ కమిషన్‌ అమలు చేయాలి

– రైతులకు పంట నష్టపరిహారం అందించాలి : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌, సాగర్‌
నవతెలంగాణ-నల్లబెల్లి
కేంద్ర ప్రభుత్వం రైతు పంటలకు 8వ తేదీన ప్రకటించిన మద్దతు ధర కనీసం రైతు ఉత్పత్తి ఖర్చులకు కూడా సరిపోవని, వెంటనే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సాగర్‌ డిమాండ్‌ చేశారు. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్‌ హాల్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా సంఘం రాజకీయ శిక్షణా తరగతులు ఆదివారం రెండవ రోజు కొనసాగాయి ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. వరి, మొక్కజొన్న, పత్తి ఇతర పంటలకు పెట్టుబడి కూడా రావడం లేదని, రైతు పంటకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ యంత్రాల ధరలు ఎక్కువగా ఉండటంతో తెచ్చిన అప్పులు తీరకుండా ఎక్కువవుతున్నాయన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుకి 50శాతం అదనంగా కలిపి మద్దతు ధరను నిర్ణయించాలని, దాన్ని కనీస మద్దతు ధరల చట్టంగా చేస్తామని 2014లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా హామీని అమలు చేయకుంటే జరిగే ఘటనలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. కార్పొరేట్‌ వ్యవసాయంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ సంవత్సరం వ్యవసాయానికి బడ్జెట్లో రెండు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వగా ఇప్పుడు 50వేల కోట్ల రూపాయలను తగ్గించారని విమర్శించారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ నాలుగు సంవత్సరాల ఆరు నెలలు పూర్తయినప్పటికీ చేయలేదన్నారు. గత మార్చిలో అకాల వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించినప్పటికీ రూపాయి ఇవ్వలేదని అన్నారు. కౌలు రైతుల చట్టం చేయాలని, పోడు రైతులకు పట్టాలు అందించాలని డిమాండ్‌ చేశారు.అనంతరం సాగర్‌ మాట్లాడుతూ… అశ్వరావుపేటలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 14,15,16న నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల పెట్టుబడి కూడా రాక.. ఏడాదికి 10వేల నుంచి 13వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వంలో రుణ విమోచన చట్టం ఉందని, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని సూచించారు.

Spread the love