నవతెలంగాణ – హైదరాబాద్
అమెరికా సారథ్యంలోని రష్యా వ్యతిరేక కూటమి నాటోలో తాజాగా స్వీడన్ చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో స్వీడన్ తన 200 ఏళ్ల తటస్థ వైఖరికి ముగింపు పలుకుతూ నాటోలో 32వ సభ్య దేశంగా మారింది. స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. నాటోలో చేరికను స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు విజయంగా అభివర్ణించారు. సర్వసత్తాక స్వతంత్ర రాజ్యంగా స్వీడన్ నాటోలో చేరిందని అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి నాటోలో చేరికకు అధికారిక అమోదం తెలుపుతుందని అన్నారు. కాగా, బ్రసెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో సోమవారం స్వీడన్ జెండాను ఎగరేయనున్నారు. ఈ పరిణామంపై రష్యా ఘాటుగా స్పందించింది. నాటో సేనలు స్వీడన్‌లో కాలు పెడితే తగు చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలో నాటో కూటమి ఏర్పడిన విషయం తెలిసిందే. అమెరికాతో సన్నిహిత సైనిక సంబంధాలు ఉన్నప్పటికీ స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాలు కొన్నేళ్లుగా తటస్థ వైఖరిని అనుసరిస్తూ నాటోకు దూరంగా ఉంటున్నాయి. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తరువాత రెండు దేశాల దౌత్యవ్యూహాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది ఫిన్‌లాండ్ నాటోలో చేరగా తాజాగా స్వీడన్ కూడా ఆ కూటమి భాగస్వామి అయ్యింది. నాటోలో చేరేందుకు రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు తాజాగా కొలిక్కి రావడంతో స్వీడన్ కూడా నాటో సభ్యదేశంగా మారింది. దీంతో, రష్యా మినహా బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్న దేశాలన్నీ నాటోలో చేరాయి. యుద్ధం సమయంలో రష్యాను అమెరికా మరింతగా ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు పెరిగాయి. ఇక 19వ శతాబ్దంలో నెపోలియన్ కాలం తరువాత స్వీడన్ ప్రపంచయుద్ధాలు సహా ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు.