స్త్రీ ఆత్మగౌరవానికి ప్రతీకలు ‘గెలుపు గాయాలు’

ఈ అసమాన సమాజంలో మహిళలు ఎన్నో గాయాలను మౌనంగా భరిస్తున్నారు. ఆ గాయాలకు ‘గెలుపు గాయాలు’ అనే చల్లటి లేపనం పూశారు మణి వడ్లమాని. ఈ పురుషాధిక్య సమాజంలో అణిచివేతకు గురవుతున్న స్త్రీకి దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తున్నాయి ఈ కథలు. అసమానతలను ప్రశ్నిస్తూ, సమాజానికి ఎదురీదుతున్న మహిళల జీవితాలే ఈ కథలు.
చిన్న కథతో మనలో అనంతమైన చైతన్యాన్ని నింపే విలక్షణ కథయిత్రి మణి వడ్లమాని. దీనికి నిదర్శనమే ‘గెలుపు గాయలు’. ఇందులోని పదమూడు కథలు ఒక్కో కథ ఒక్కో స్త్రీ శక్తిని చాటి చెబుతున్నాయి. కడుపు నింపుకోవడానికి, కడుపున పుట్టిన వారిని బతికించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో, ఇష్టం లేకపోయిన కొన్ని రకాల పనులను చేయాల్సి వస్తుంది. ఓ రకంగా బలవంతంగా ఆ ఊబిలో చిక్కుకుంటారు మహిళలు. అలాంటి జీవితాలను ‘ముళ్ళ పూలు’ కథలో చిత్రించారు. కరోనా ఆత్మీయులను దూరం చేసింది. ఆ సమస్యలను కండ్లకు కట్టినట్టు అక్షరీకరించారు ‘బస్‌ స్టాప్‌’ కథలో.
భార్యను గర్భవతిని చేసి రంగు తక్కువుందని వదిలి వెళ్ళిపోతాడు. ఎన్నో కష్టాలు పడి ఆమె కొడుకుని పెంచి ప్రయోజకుడిని చేస్తుంది. రెక్కలు వచ్చిన ఆ కొడుకు తల్లికి ఇచ్చిన విలువేంటో, దానికి ఆ తల్లి ఇచ్చిన సమాధానం ఏంటో ‘అమ్మ గెలిచింది’ కథలో మనం చదవొచ్చు. ఇక ‘యుద్ధం’ కథలో రెక్కాడితే కాని డొక్కాడని పేదల జీవితాలను, వారి స్థితి గతులను చక్కగా వర్ణించారు. ఇప్పటికీ రుతుస్రావాన్ని అంటరాని క్రతువుగా చూసే సమాజాన్ని ప్రశ్నిస్తుంది. మీ టూ ఉద్యమంలో భాగమయ్యింది.
అత్తాకోడళ్ళను శత్రువులుగా చూపించడం సహజం. కానీ తన ‘శబ్దచిత్రం’ కథలో ఒకరికి ఒకరు అండగా నిలబడే మహిళలుగా చూపడం నిజంగా చాలా బాగుంది. ఈ ఐక్యత నేటి తరానికి చాలా అవసరం. ఇంకా వృద్దాప్యంలో పిల్లల ప్రేమ కరువై విలవిలడాతున్న తల్లి బాధ, ఒంటరి మహిళ వ్యథలు… ఇలా ఎన్నో ఈ సంపుటిలో కథా వస్తువులయ్యాయి. సమస్యలను చూపడమే కాదు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న పాత్రలనూ చూపించారు. మహిళంటే ఇలా కదా ఉండాల్సింది అనిపిస్తుంది మనకు. మొత్తానికి మహిళలు తమ జీవితంలో చేస్తున్న పోరాటాలు, చేస్తున్న త్యాగాలకు అద్దం పడుతుంది ఈ కథా సంపుటి. అందరికీ అర్ధమయ్యే సరళమైన భాషలో కథలను సృష్టించడం ఈ రచయిత్రిలోని మరో ప్రత్యేకం.
– సలీమ, 9490099083 

Spread the love