నవతెలంగాణ-హైదరాబాద్ : సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మరణించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రయాణించిన విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. దీంతో దేశం నుంచి పారిపోతుండగా ఆ విమానాన్ని కూల్చివేయడం లేదా కూలిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. సిరియా రాజధాని డమాస్కస్‌ను రెబల్ దళాలు స్వాధీనం చేసుకున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం డమాస్కస్ ఎయిర్‌పోర్ట్ నుంచి సిరియన్ ఎయిర్ విమానం బయలుదేరింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఈ విమానంలో పారిపోయినట్లు సమాచారం. కాగా, సిరియన్ ఎయిర్ విమానం ఇల్యుషిన్ Il-76టీ తొలుత సిరియా తీర ప్రాంతం వైపు వెళ్లినట్లు ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్‌రాడార్24.కామ్ డేటా ద్వారా తెలిసింది. ఆ విమానం అకస్మాత్తుగా మార్గాన్ని మార్చుకున్నది. వ్యతిరేక దిశలో ప్రయాణించిన ఆ విమానం రెబల్స్‌కు పట్టున్న హోమ్స్ నగరం సమీపంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. ఆ సమయంలో 3,650 మీటర్ల ఎత్తు నుంచి 1,070 మీటర్లకు ఆ విమానం పడిపోయినట్లు ఫ్లైట్ డేటా సూచించింది. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని రెబల్స్ కూల్చివేసి ఉంటారని, లేదా ఆ విమానం ఆ ప్రాంతంలో కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ విమాన ప్రమాదంలో బషర్ అల్ అసద్ మరణించినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే సిరియా అధికారులు దీనిని ధృవీకరించలేదు.