‘టాఫ్రికర్‌’

'Tafrikar'– రోడ్లపై విచ్చలవిడిగా నిలుపుతున్న వాహనాలు
– రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు.. పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మంచిర్యాల
రోడ్ల పైనే వాహనాలు పార్కింగ్‌ చేయడంతో మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. నియంత్రణకు అధికారులు చొరవ చూపక పోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల పైనే ఇష్టం వచ్చినట్లు వాహనాలను పార్కింగ్‌ చేయడంతో పలు సార్లు ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీనితో గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. రోడ్లపై పార్కింగ్‌ చేసే వాహనాల మీద అధికారులు ద్రుష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ప్రధాన రహదారిపైనే తీవ్రం
మంచిర్యాల పట్టణంలో పార్కింగ్‌ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారితో పాటు మంచిర్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్‌ రోడ్‌, అర్చన టెక్స్‌ చౌరస్తా, మార్కెట్‌ రోడ్‌లో ఇష్టాను సారం పార్కింగ్‌ చేసే వాహనాల వళ్ళ పాద చారులతో పాటు తోటి వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌ మాల్‌కో లేక మార్కెట్‌ కో వెళ్లే సమాయంలో అక్కడ ఎదురైనా ట్రాఫిక్‌ సమస్య నేపథ్యంలో మరో సారి అటు వైపు వెళ్ళాలంటేనే ఆలోచిస్తున్నారు. పట్టణ ప్రజలు, బెల్లంపల్లి చౌరస్తా నుండి రైల్వే స్టేషన్‌ వరకు ఉన్న రోడ్డుపై నిత్యం ఏదో ఒక ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది. రోడ్డు ను ఆనుకొని ఉన్న షాపింగ్‌ మాల్స్‌, హాస్పిటల్స్‌కు ఏదో ఒక పని మీద వచ్చే వాహన దారులు వారి వాహనాలను రోడ్డుపై నిలిపి వచ్చిన పని కానిచ్చేసుకుంటున్నారు. ఆ రోడ్డుపై ఉన్న కొన్ని భవనాలకు సెల్లార్లు ఉండగా మరి కొన్ని భవనాలకు సెల్లార్లు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. భవనములో నిర్వహించే వ్యాపారాలకు అధికారులు ఎలా అనుమతులు ఇస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా ఎన్ని చర్యలు తీసుకునున్నప్పటికీ ఇటు వాహనదారులు, బహుళ అంతస్తుల్లో వ్యాపారాలు కొనసాగించే వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో సమస్య తీవ్రమవుతోంది.
సెల్లార్‌లో సైతం వ్యాపారం
మంచిర్యాల పట్టణంలోని రహదారిపై ఉన్న భవనాలకు సెల్లార్లు లేవు, కొన్నింటికి సెల్లార్లు ఉన్న వాటిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు అద్దెకు ఇచ్చారు. దీనితో వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు స్థలం లేక రోడ్డుపైనే పార్కింగ్‌ చేయాల్సి వస్తోంది. మార్కెట్‌ రోడ్‌ లోని బిల్డింగుల్లో కొనసాగుతున్న వ్యాపారాలకు సెల్లార్‌లో పార్కింగ్‌ అనేది లేదు. దీనితో అట్టి షాపింగ్‌ మాల్స్‌కి వెళ్లే వారు ఎవరైనా వాహనాలను రోడ్డుపై నిలిపి వెళ్తున్నారు. ఇటీవల మున్సిపల్‌ అధికారులు 92 మంది బిల్డిగ్‌ యజమానులకు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ వారి పద్దతిలో మార్పు రావడం లేదు. ఇప్పటికైనా సెల్లార్లు కాలీ చేయించి అక్కడే వాహనాలను పార్కింగ్‌ చేసేల అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మార్కెట్‌కి వెళ్ళాలి అంటేనే భయం వేస్తోంది
మౌనిక, గహిణి మంచిర్యాల.
నిత్యం ఏదో పని మీద మంచిర్యాల మార్కెట్‌కి వెళ్తుంటాము. రోడ్డు మీద ఎటు చుసిన వాహనాలు పార్కింగ్‌ చేసి కనిపిస్తాయి. కూరగాయలు, బట్టలు కొనేందుకు మార్కెట్‌ వెళ్లిన ప్రతి సారి ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ంటుంది. రోడ్డుపై నడవాలంటే కష్టం ఐతుంది. అసలే రోడ్డు చిన్నదిగా ఉంది అందులో అదే రోడ్డుపై వాహనాలు పార్కింగ్‌ చేసే సరికి నడవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో మార్కెట్‌కి వెళ్ళాలి అంటేనే భయం వేస్తోంది. సంబదిత అధికారులు ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారాం చూపాలి.
సెల్లార్లు కాలీ చేయిస్తున్నాం
బి సత్యనారాయణ ,ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌.
రోడ్లపై పార్కింగ్‌ చేసే వాహనాలకు నిత్యం ఫైన్‌ వేస్తున్నాం. డ్యూటీలో ఉన్న సిబ్బంది ప్రతి రోజు ట్రాఫిక్‌ సమస్య రాకుండా వాహన దారులకు సూచనలు ఇస్తున్నారు. మున్సిపల్‌ అధికారులతో మాట్లాడినం, నోటీసులు అందించామని తెలిపారు. నెలలో సెల్లార్లు ఖాళీ అయ్యేలా వారు చర్యలు చేపట్టారు. సెల్లార్లు ఖాళీ చేయించి వాహనాలు రోడ్డుపై పార్కింగ్‌ చేయకుండ సెల్లార్లలో పార్కింగ్‌ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తాం.

Spread the love