కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

నవ తెలంగాణ – నవీపేట్
కేంద్రం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సాజిద్ అలీ, సర్పంచ్ ఆసోల్ల శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆసోల్ల శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం వికసిత్ భారత్ సంకల్పయాత్ర ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి మహిళలు మరియు రైతుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఆర్థిక అభివృద్ధి కోసం బ్యాంకు ద్వారా రుణాలు, ఇన్సూరెన్స్, భీమా, పథకాలను ప్రవేశపెట్టిందని అలాగే వ్యాపార అభివృద్ధి కోసం 3 లక్షల నుండి 30 లక్షల వరకు రుణాలను తక్కువ వడ్డీతో ఇస్తుందని అన్నారు. అలాగే రైతులకు వ్యవసాయ పెట్టుబడితో పాటు ఎరువులలో సబ్సిడీని ఇస్తూ ఆదుకుంటుందని అన్నారు. అనంతరం డ్రోన్ ద్వారా పంటలకు రసాయన మందుల పిచికారి పద్ధతిని ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం భూమేశ్వర్ గౌడ్, కార్యదర్శి రవీందర్ నాయక్, నవీన్ రాజ్, బ్యాంకు అధికారులు అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, ఐకెపి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love