– 2023 సెమీ ఫైనల్స్‌లో గెలిచాం ఫైనల్స్ గెలవాలి
– రాహుల్‌ను ప్రధాని చేయడమే మన లక్ష్యం
– రాష్ట్రం నుంచి 15 ఎంపీ స్థానాలు గెలవాలి : సీఎం రేవంత్
– టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వం అనేక ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేస్తున్నదనీ, వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ నూతన అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2023లో రాష్ట్రంలో సాధించిన గెలుపు సెమీ ఫైనల్స్‌లో గెలుపు మాత్రమేననీ, 2028లో జరగబోయే ఫైనల్స్‌లో గెలించేందుకు నిబద్ధతతో ముందుకెళ్లాలని సూచించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కదలాలని పిలుపునిచ్చారు. అప్పటి వరకు విశ్రమించొద్దనీ, సెలవు తీసుకోవద్దని కోరారు.
పేదల కష్టాలు తీర్చాలని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీ రూ.10 లక్షల పెంచడం, రైతు రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్టు తెలిపారు. రాబోయే పంటల్లో సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటికే 30 వేల ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామనీ, మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చెప్పారు. ఈ ఏడాది చివరల్లో మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే త్రిబుల్ ఆర్ ప్రాజెక్టుకు అనుమతి వస్తుందని సీఎం వెల్లడించారు.
సన్నాసి ఎక్కడ దాక్కున్నాడు?
రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని ఒక సన్నాసి సవాల్ విసిరారనీ, ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ సన్నాసి రాజీనామా చేస్తే సిద్దిపేట పీడ విరగడవుతుందనీ, దూలంలాగా పెరిగినా దూడకున్న తెలివి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంచోళ్లు. ఎవరైనా వారి జోలికొస్తే ఊరుకోరు అని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర నాయకత్వం కదులుతుందని భరోసానిచ్చారు.
మహేష్ వెనుక నేనున్నా…
మహేష్ కుమార్ గౌడ్ సౌమ్యుడు. టీపీసీసీ అధ్యక్షునిగా వచ్చారు. తాము రాష్ట్రంలో రెచ్చిపోవచ్చని ఎవరూ భ్రమలు పెట్టుకోవద్దని సీఎం హెచ్చరించారు. మహేష్ కుమార్ గౌడ్ వెనుక తానున్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రిగా, టీపీసీసీ అధ్యక్షునిగా రెండు బాధ్యతలకు సమయం సరిపోవడం లేదన్నారు. అందుకే తానే పార్టీ అధ్యక్షునిగా పూర్తి సమయం ఇచ్చే నాయకున్ని నియమించాలని తానే కోరినట్టు తెలిపారు.
బలహీనవర్గాలకు సముచిత స్థానం
బలహీనవర్గాలకు సమూచిత స్థానం లభించాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీసీ జనాభా లెక్కలు తీసి, వారికి రావాల్సిన వాటా వారికి ఇవ్వాల్సి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారిని గెలిపించుకుంటామన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కార్యకర్తల శ్రమను గౌరవిస్తూ వారి అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్‌లో గుర్తింపు ఉంటుందనేందుకు మహేష్ కుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమని తెలిపారు. టీపీసీసీ మాజీ అధ్యక్షులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీల్లో ఒక కుటుంబం, ఒకే సామాజికవర్గానికి చెందిన వారికే నాయకత్వం ఉంటుందని విమర్శించారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్టు ఏఐసీసీ నిరూపించిందని తెలిపారు. పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. కులగణన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ బీజేపీ మత విద్వేష రాజకీయాలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
నా జీవితం ధన్యం : మహేష్ కుమార్ గౌడ్
టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తన జీవితం ధన్యమైందని తెలిపారు. ఏనాడు టీపీసీసీ అధ్యక్షున్ని కావాలని తాను అనుకోలేదని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ తన ఎదుగుదలకు దోహదపడిందని తెలిపారు. మాజీ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డిలు తనను ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. గాంధీభవన్‌తో తనకు 40 ఏండ్లపాటు అనుబంధం ఉందని తెలిపారు. రాజకీయాల్లో ఎదిగేందుకు అవకాశమిచ్చే వారుండాలన్నారు. ప్రతి కార్యకర్తకు అందు బాటులో ఉంటానని తెలిపారు. కలిసికట్టుగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.హైడ్రా చారిత్రక నిర్ణయమనీ, దానిని కొనసాగిస్తూ అన్ని జిల్లాలకు విస్తరించాలని మహేష్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. అయితే పేదలకు పునరావాసాన్ని కల్పించాలని కోరారు. భువనగిరిలో రాజీవ్‌గాంధీ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయాలు నిర్మించుకునేందుకు మార్కెట్ రేటుకు భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి వారం రొటేషన్ పద్ధతిలో ఇద్దరు మంత్రులు, నెలకు ఒకసారి ముఖ్యమంత్రి గాంధీభవన్ రావాలని ఆకాంక్షించారు. మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కొంత సమయాన్ని కాంగ్రెస్ కార్యాలయంలో గడిపితే బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శు లు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మెన్లు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. గాంధీభవన్‌కు ప్రదర్శనగా వచ్చిన ఆయనకు సీఎం, మంత్రులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
రేవంత్ ప్రస్థానమిదే..
తెలంగాణ ఏర్పాటు తర్వాత వ్యూహాత్మక వైఫల్యాలతో మనుగడ కోసం పోరాడుతున్న కాంగ్రెస్‌టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక అధికారంలోకి వచ్చింది. 2018 నాటికి 19 సీట్లకే పరిమితమైన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక సవాళ్లు ఎదురైనా వెనుదిరగకపోవడమే ఆయనకు కలిసొచ్చింది. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ బాధ్యతలు చేపట్టాక హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం కాగా, దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ మాత్రమే బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమనే భావన ప్రజల్లో బలపడింది. ఈ పరిస్థితిలో పార్టీ నిర్మాణం కోసం డిజిటల్ మెంబర్‌షిప్ కార్యక్రమం చేపట్టారు. రైతులు, దళిత, గిరిజన, బీసీ, యువత, విద్యార్ధులు, మైనార్టీ ఇలా వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలను డిక్లరేషన్ ల రూపంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్యల సమక్షంలో విడుదల చేశారు. పెట్రోల్ ధరల పెంపుపై నిరసనలతో పాటు దళిత, గిరిజన దండోరా, ఆత్మగౌరవ దీక్ష, డ్రగ్స్ వ్యతిరేకంగా వైట్ చాలెంజ్, నిరుద్యోగ జంగ్ సైరన్, రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమాలు, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు ప్రజలను తిరిగి కాంగ్రెస్ వైపు చూసేలా చేశాయి. స్థానిక సమస్యలపై మన ఊరు – మన పోరుతో పాటు, ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగుల పక్షాన పోరాటాలు కాంగ్రెస్ బలాన్ని పెంచాయి. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కోసం పోలీసులను తప్పించుకుని అక్కడికి రేవంత్ చేరుకుని విద్యార్థులను ఆకర్షించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర, ప్రశ్నాపత్రాల లీకేజీపై పోరాటాలతో పాటు ఆరు గ్యారంటీలు, ఎన్నికలకు ముందు ప్రజల అభిప్రాయాలను తీసుకుని మ్యానిఫెస్టో రూపకల్పన తదితర కార్యక్రమాలు కాంగ్రెస్ ను ప్రజలకు చేరువ చేశాయి.