– ఎక్కడికక్కడ సంబరాలు చేయాలని నిర్ణయం
– పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘రాష్ట్ర ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వీఆర్‌ఏ క్రమబద్ధీకరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, హైదరాబాద్ చుట్టూ మెట్రో ప్రాజెక్టులు వంటి నిర్ణయాలపై ఎక్కడిక్కడ సంబురాలు చేయాలి. అనాధల పాలసీని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’ అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఒక టెలి కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజాను కూల నిర్ణయాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేలా ప్రయత్నించాలని పార్టీ శ్రేణులను కోరారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ కూడా గతంలో ఎన్నడూ తీసుకొని విధంగా ఉద్యోగుల పట్ల ఎంతో ఔదార్యం తో నిర్ణయం తీసుకున్నారని, దీన్ని ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని దిశా నిర్దేశం చేశారు. తాజాగా 21 వేల మంది వీఆర్‌ఏల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని, ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న మానవీ యతను చాటి చెబుతుం దన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబురాలు నిర్వహించాలని పార్టీ నాయకుల కు సూచించారు. దీంతోపాటు ఒకటి రెండు రోజుల్లో అటు వీఆర్‌ఏల కుటుంబాలతోను, ఆర్టీసీ కార్మికులతో ను ప్రత్యేకంగా ఆత్మీయ సమావే శాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియో జకవర్గ ఇన్ చార్జీలకు కేటీఆర్ సూచించారు. కేవలం ఉద్యోగుల పట్లనే కాకుండా రాష్ట్రంలో ఉన్న అనాధల అందరిని ఒక పాలసీ కిందకు తీసుకొచ్చి, వారి బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా చేసిన నిర్ణయం కూడా అత్యంత మానవీయమైన పరిపాలన నిర్ణయమని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర రాజధానిలో ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ముఖ్యంగా విస్తరణ తర్వాత మెట్రో అందుబాటులోకొచ్చే నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతుందని, నగర విస్తరణకు అనేక సానుకూల అంశాలు ఏర్పడతా యన్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మెట్రో విస్తరణ పూర్తి అయితే హైదరాబాద్ చుట్టుపక్కలున్న సుదూర ప్రాంతాలు కూడా వేగంగా అభివద్ధి చెందుతాయన్న విశ్వాసాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో ఇబ్బందులు పాలైన ప్రజలకు ఉపశమనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా ప్రకటించిన రూ.500 కోట్లు ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. మంత్రివర్గ నిర్ణయాలపై జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ ఆలోచనల గురించి వివరించాలన్నారు.