– టీయూఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ నిర్ణయం మేరకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ- సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్, యూనియన్ నాయకులు మంగళవారం హైదరాబాద్‌లో ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. రూ.15,600 చెల్లించాలని నిర్ణయిస్తే కాంట్రాక్ట్ సంస్థలు రూ.10,500 నుంచి రూ.11 వేలు మాత్రమే చెల్లిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలనీ, కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
104 ఉద్యోగులకు సంబంధించిన కొనసాగింపు ఉత్తర్వులను వెంటనే ఇప్పించాలని భూపాల్ డిమాండ్ చేశారు. ఈ ఉత్తర్వులు రాకపోవడంతో 1,350 మంది ఉద్యోగులు భద్రత సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ కమిషనర్ కార్యదర్శి ద్వారా పంపిన ఫైలు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు.