– అందజేయనున్న మంత్రి సీతక్క : తెలంగాణ బాలోత్సవం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సర్కారు పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల ఎనిమిదో తేదీన ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నట్టు తెలంగాణ బాలోత్సవం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు నల్లపు సోమయ్య, ఉపాధ్యక్షులు కె.సుజావతి చెప్పారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) పాల్గొంటారని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆజామాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరింజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ప్రతిభా పాటవాలను వెలికి తీయడానికి తెలంగాణ బాలోత్సవం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. అందులో భాగంతో ప్రభుత్వ పాఠశాల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. 10/10 గ్రేడింగ్ సాధించిన 1000 మంది విద్యార్థులకు వాటిని ఇవ్వనున్నట్టు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న అలాంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఉన్నతస్థాయికి ఎదుగుతారన్నారు. విద్యారంగం ప్రభుత్వ రంగంలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పురస్కారాల అందజేత కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇ.వి.నరసింహారెడ్డి, సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ రచయిత ఆకెళ్ల రాఘవేంద్ర, తదితరులు హాజరవుతారని తెలిపారు.