– కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి
– నా ఫైళ్ళన్నీ హిందీలోనే
– భారతీయ భాషలతో హిందీకి విడదీయలేని సంబంధముందని వ్యాఖ్య
న్యూఢిల్లీ : పిల్లలతో వారి మాతృభాషలోనే మాట్లాడాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తల్లిదండ్రులను, సంరక్షకులను కోరారు. ‘ఇతర భాషల ద్వారా పురోగమనం’ అనే వెల్లువలో పడి కొట్టుకుపోవడద్దని సూచించారు. భారతీయ భాషలదే భవిష్యత్ అంతా అని ఆయన నొక్కి చెప్పారు. ఇక వలసవాద సంకెళ్ళతో దేశాన్ని బంధించలేమన్నారు. హోం శాఖకు సంబంధించిన ఫైళ్ళన్నీ హిందీలోనే వుండేలా తాను చూస్తానని చెప్పారు. ”నాలాంటి వారికి కూడా ఇలా అన్ని ఫైళ్లు హిందీలోనే రావడానికి మూడేళ్ళు పట్టింది. నా శాఖలైన హోం, సహకార శాఖలకు సంబంధించి ఏ ఫైలు కూడా ఇంగ్లీషులో వుండదు. అన్నీ హిందీలోనే.”అని షా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇదే విషయం చెప్పాలనుకుంటున్నానని అన్నారు. హిందీని అధికార భాషగా ప్రకటించి 75ఏళ్లయిన సందర్భంగా అఖిల భారతీయ రాజ్‌భాషా సమ్మేళన్‌లో ఆయన మాట్లాడారు. ఇతర భారతీయ భాషలతో హిందీకి పోటీనే లేదన్నారు. భారతీయ భాషల సెక్షన్ (బిబిఎ)ను షా ప్రారంభించారు. హిందీలో వ్యాసం లేదా ప్రసంగం లేదా లేఖ వస్తే వెంటనే బిబిఎ దాన్ని దేశ భాషల్లోకి అనువదిస్తుందని చెప్పారు. అలాగే ఇతర భాషల్లో వచ్చిన వాటిని హిందీలోకి కూడా అనువదించాలన్నారు. యుపి, ఎంపి, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లు మొత్తంగా వైద్యవిద్య సిలబస్‌ను హిందీలో అందుబాటులోకి వచ్చేలా చేశాయన్నారు. ఇక రాబోయే రోజుల్లో పరిశోధనా భాష కూడా కచ్చితంగా హిందీలో వుంటుందన్నారు. దేశవ్యాప్తంగా కవుల, రచయితలు, పండితులు, మేథావులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి భారతీయ భాషతో హిందీకి విడదీయలేని సంబంధం వుందన్నారు.