రైతులతో నేరుగా మాట్లాడండి

రైతులతో నేరుగా మాట్లాడండి– భూసేకరణలో మానవీయత ఉండాలి
– త్రిబుల్‌ ఆర్‌ అంతటికీ ఒకే నెంబర్‌
– అటవీ భూములకు ప్రత్యామ్నాయం : కలెక్టర్లకు సీఎం ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో ఆమేరకు రైతులకు దక్కేలా చూడాలని చెప్పారు. బుధవారం రాష్ట్రంలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా, భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని సీఎం ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ధరలు తక్కువగా ఉండడం, మార్కెట్‌లో ధరలు అధికం కావడంతోనే భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని సీఎం ప్రశ్నకు కలెక్టర్లు బదులిచ్చారు. ఇందుకు స్పందించిన సీఎం తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. కలెక్టర్లు రైతులను పిలిచి నేరుగా మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం, ఉత్తర భాగం వేర్వేరుగా చూడొద్దనీ, ఆ రెండింటికి కలిపి ఒకే నెంబర్‌ కేటాయించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సీఎం తెలిపారు. ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. వెంటనే దానిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంలో భూసేకరణలో ఉన్న ఆటంకాలపై సీఎం ఆరా తీశారు. అలైన్‌మెంట్‌ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారనీ, దాంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి-భువనగిరి కలెక్టర్‌ హన్మంత్‌ కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్‌ దాఖలు చేయాలని కలెక్టర్‌కు, సీఎం సూచించారు. నాగ్‌పూర్‌-విజయవాడ కారిడార్‌లో ఖమ్మం జిల్లాలో భూ సేకరణ పరిస్థితి ఏమిటని సీఎం అడిగారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా రహదారి పోతుందనీ, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తల్లాడ-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి పనులు సాగుతున్న కారణంగా, ప్రస్తుత ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కోరుతున్నారని చెప్పారు. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదన్నారు. జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ నాగ్‌పూర్‌-విజయవాడ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న రహదారిలో పెద్ద గ్రామాలున్న చోట సర్వీసు రోడ్లు నిర్మించాలని సూచించారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లు నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు సభ్యడు అనిల్‌చౌదరి బదులిచ్చారు. జాతీయ రహదారుల వెంట రైతుల వాహనాలు, రైతులు వినియోగించుకునేలా మట్టి(గ్రావెల్‌) రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు సభ్యుడు అనిల్‌చౌదరి తెలిపారు. మట్టి రోడ్లు నిర్మించడం వలన రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్తులో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని సీఎం అభిప్రాయపడ్డారు.
‘సమన్వయంతో ముందుకు సాగండి’
ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల, విజయవాడ-నాగ్‌పూర్‌ కారిడార్‌ రహదారులకు సంబంధించి అటవీశాఖ భూముల బదలాయింపు సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దష్టికి అధికారులు తెచ్చారు. దీనికి సీఎం స్పందిస్తూ అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్‌, మంచిర్యాల, మహబూబాబాద్‌ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను అటవీ శాఖకు బదలాయించి అటవీ శాఖ భూములను తీసుకొని రహదారుల నిర్మాణానికి ఉన్న ఆటంకాలను తొలగించాలని సీఎం సూచించారు. వివిధ శాఖల పరిధిలోని యుటిలిటీస్‌ తొలగింపునకు సంబంధించి చెల్లింపులు వేగవంతం చేయాలనీ, ఏవైనా సమస్యలుంటే ఎన్‌హెచ్‌ఏఐతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌ -మన్నెగూడ రహదారి పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అంగీకరించారు.
రెండు నెలల్లో హైదరాబాద్‌-విజయవాడ విస్తరణ పనులు
హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ పనులకు భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో వెంటనే పనులు చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్‌ అనిల్‌చౌదరిని కోరారు. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన ఇందుకు బదులిచ్చారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ఓఎస్డీలు వి.శేషాద్రి, మాణిక్‌రాజ్‌, చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్‌ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు కె.ఎస్‌ శ్రీనివాసరాజు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్‌, పీసీసీఎఫ్‌ డోబ్రీయల్‌, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీష్‌, మెదక్‌, యాదాద్రి భువ నగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయ శంకర్‌-భూపాలపల్లి, హన్మ కొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.

Spread the love