‘పంచాయతీ’ జేఏసీతో చర్చించి సమ్మెను విరమింపజేయండి

 Talk to the 'Panchayat' JAC and call off the strike

– సీఎం కేసీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే జూలకంటి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గ్రామపంచాయితీ కార్మికుల సమ్మె కారణంగా గ్రామాల్లో చెత్త పేరుకపోయి విషజ్వరాలు ప్రబలే ప్రమాదముందని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీలో చర్చించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. ఈమేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. గత 21 రోజుల నుంచి గ్రామ పంచాయితీ కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను, ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. గత్యంతరం లేక సమ్మెకు వెళుతున్నట్టు వారు ముందుగానే తెలియజేశారని వివరించారు. అయినా. ప్రభుత్వం ముందస్తుగా వారితో చర్చించకపోవడం, నిరక్ష్యం, లెక్కలేనితనంతో వ్యవహించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమైన చర్యని తెలిపారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, 21 రోజుల నుంచి వీధులు ఊడ్చకపోవడం వల్ల చెత్తా, చెదారంతో గ్రామాలు కంపుకొడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలక మండళ్ళు కూడా సమస్య తీవ్రతను గుర్తించి, వీరి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తీర్మానాలు కూడా చేస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలనీ, ఒకరికిచ్చే నెల వేతనం ఇద్దరికి, ముగ్గురికి పంచే పద్ధతి సరైంది కాదని తెలిపారు. అవసరమైతే కొత్తగా నియామకమైన వారికి అదనపు బడ్జెట్‌ కేటాయించి కనీస వేతనం అమలు చేయాలని సూచించారు. మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాత కేటగిరీలను కొనసాగించాలనీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు, ఎనిమిది గంటల పని విధానం, వారాంతం, ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని కోరారు. కార్మికులు అడిగేది గొంతెమ్మ కోరికలు కావని తెలిపారు. వీటిలో కొన్నింటిని అమలు చేస్తామన్న హామీ కూడా అమలుకు నోచుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కార్మికుల తరపున సమ్మె ప్రారంభమైన కాలం నుంచి తాము కూడా పలుమార్లు అధికారులు, మంత్రులకు సమస్యలను, పరిస్థితుల తీవ్రతను వివరించామని గుర్తు చేశారు. అయినా స్పందించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా జేఏసీ కార్మిక జీవితాలను, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెంటనే కార్మిక సంఘాల జేఏసీని పిలిచి, వారితో చర్చించి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. తద్వారా సమ్మెను విరమింపజేయాలని జూలకంటి …సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Spread the love