నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణలో తాను ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నానని ఆమె చెప్పారు. రెండేళ్లుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తనకు అందుబాటులో లేరని వ్యాఖ్యానించారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే తన బలమని.. అలాగే అన్నింటినీ దాటగలుగుతున్నానని చెప్పుకొచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ.. పరిస్థితులను ఆస్వాదిస్తూ, తగినట్టు స్పందించడం ద్వారా పని భారం లేకుండా చేసుకోవచ్చని చెప్పారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. లైంగిక వేధింపులపై బాల్యం నుంచే ఆడపిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. తల్లిదండ్రులు కాస్త సమయం కేటాయిస్తే ఆడపిల్లలు అనేక సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఆరోగ్య బీమాపై అవగాహన పెరగాలని తమిళిసై సూచించారు. ‘‘ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఉపయోగపడతాయి. అప్పట్లో సీఎంతో మాట్లాడి ఆయుష్మాన్ భారత్.. తెలంగాణలో అమలయ్యేలా చేశాం’’ అని వెల్లడించారు. మనం డబ్బును లెక్కబెడుతున్నాం కానీ క్యాలరీలు లెక్కిస్తున్నామా? అని ప్రశ్నించారు. ఒక్క మహిళ విజయం 1000 మంది పురుషుల విజయంతో సమానమని చెప్పారు.