టార్గెట్‌ ఈటల?

– ఒంటర్నిచేసే యత్నం…
– గ్రూపులుగా చీలిన ఈటల, బండి
– మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో పలువురు నేతల భేటీ
– కొండా, విజయశాంతి, వివేక్‌, విఠల్‌, బూర తదితరులు హాజరు
– ఈటలకు ప్రమోషన్‌ ప్రచారంపై పెదవివిరుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీలో పదవుల మార్పు అంశం చిచ్చు రేపుతున్నది. కొంత కాలంగా నడుస్తున్న అంతర్గపోరు పీక్‌స్టేజీకి చేరుతున్నది. మొన్నటిదాకా బండికి వ్యతిరేకంగా వీచిన గాలి ఇప్పుడు ఈదురుగాలై ఈటల వైపు మళ్లింది. ఈ రాజకీయ తుఫాన్‌ బీజేపీలో కల్లోలం సృష్టించేలా కనిపిస్తున్నది. ఈ విషయంలో జాతీయ నాయకత్వం ఎత్తులు జిత్తులు కూడా పనిచేయట్లేదని తెలుస్తున్నది. ఆ పార్టీలో ఇన్నాళ్లు ఈటల రాజేందర్‌ పాట పాడినోళ్లంతా ఇప్పుడు బండి రాగం ఎత్తుకోవడం కొత్త పరిణామాలకు దారితీస్తున్నది. ఇప్పుడు ఈటలే టార్గెట్‌గా తతంగం నడుస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఇప్పుడు బీజేపీలో ఉన్న నేతలంతా ఉన్న ఫలానా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో భేటీ కావడం కాక పుట్టిస్తున్నది. ఆ సమావేశంలో విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, విఠల్‌, బూర నర్సయ్యగౌడ్‌, రవీంద్రనాయక్‌, వివేక్‌, మహేశ్వర్‌రెడ్డి, తదితర నేతలంతా పాల్గొన్నారు. బీజేపీలో చీలిక తెచ్చేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నాడంటూ సమావేశం అనంతం మీడియాకు చెప్పినప్పటికీ.. బీజేపీలో ఈటలకు ప్రమోషన్‌పైనే ప్రధానంగా చర్చ నడిచిందని తెలుస్తోంది. ఈ ప్రమోషన్‌పై ఆ నేతలంతా ఈటలకు వ్యతిరేకంగా మారి బండికి అనుకూలంగా మారారని ప్రచారం జరుగుతున్నది. తామూ ఉద్యమకారులమే…తమకూ ప్రజల్లో పేరుంది…మమ్ముల్ని అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు? అనే కొత్తపల్లవి ఎత్తుకున్నట్టు తెలిసింది. పార్టీ కార్యాలయం కేంద్రం కాకుండా రోజుకో చోట నేతలు సమావేశాలు పెట్టుకోవడం, ఎవరికి తోచినది వారు మాట్లాడుతుండటం..బయట జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నది.
కొద్దిరోజులుగా ఈటల రాజేందర్‌ బీజేపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తనకు మొదటి నుంచి అనుకూలంగా ఉంటూ వచ్చిన కొండా కూడా అధ్యక్ష మార్పుపై బహిరంగంగానే మాట్లాడారు. పొంగులేటి చేరికపై ఈటలనైతే ఒకడుగు ముందుకేసి ఖమ్మం జిల్లాలో బీజేపీ లేనేలేదని చెప్పారు. దీంతో ఆయన అసంతృప్తిని చల్లబర్చేందుకు అధిష్టానం అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఎన్నికల ప్రచార సారథి బాధ్యతలు ఈటల రాజేందర్‌కు, అధ్యక్ష బాధ్యతలు డీకే అరుణకు, బండి సంజరుకి కేంద్ర మంత్రి పదవిని అధిష్టానం ఇవ్వనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఇదే విషయంపై బండి మాట్లాడుతూ..రాష్ట్రంలో అధ్యక్షుడి మార్పే ఉండదు..ఎన్నికలు తన సారథ్యంలోనే జరుగుతాయని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇదే అంశంపై గతంలో..’బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినవాడ్ని నన్ను అణచాలని చూస్తే ఊరుకునే వ్యక్తి’ని కాదంటూ బండి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఈటలను డౌన్‌ఫాల్‌ చేయడాన్ని బండి గ్రూపు తీవ్రం చేసింది. బండి సారథ్యంలో ఉప ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం..జీహెచ్‌ఎంసీలో 48 స్థానాలు గెలిచాం…చేరికల కమిటీ చైర్మెన్‌గా ఈటల ఏం చేసారనే ప్రచారాన్ని ఉధృతం చేసింది. అదే సమయంలో ఈటల అసలు పార్టీనే లేదని చెప్పిన ఖమ్మంలో అమిత్‌షా సభను జయప్రదం చేసి ఈటలకు, అధిష్టానానికి తన సత్తా ఏంటో చూపాలని బండి స్వయంగా సభ ఏర్పాట్లు, జనసమీకరణ అంశాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా నడుస్తుండగానే బీసీ సామాజిక తరగతిలో బలమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్‌ను రాజకీయంగా వాడుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు పెంచుకోవాలనే భావనలో బీజేపీ అధిష్టానం ఓ అంచనాకు వచ్చి త్వరలో ఎన్నికల ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించనున్నదనే ప్రచారం ఊపందుకున్నది. దీంతో టికెట్లు ఆశిస్తున్న, కీలక నేతలు ఈటలను కలిసేందుకు ఆదివారం నాడు ఆయన నివాసానికి వెళ్లడంతో అక్కడ సందడి నెలకొంది. మరోవైపు ఈటల వెనుక ఉన్నవారంతా ఒక్కసారిగా వేరుకుంపటి పెట్టేశారు. ‘నేను అణగదొక్కితే అణిగి ఉండేవాన్ని కాదు..నేనేంటో చూపిస్తా’ అని బండి వ్యాఖ్యలు చేసినట్టుగానే జరుగుతున్నది. ఓపక్క బండి సంజరు…కేంద్ర మాజీ మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌తో వేములవాడ పర్యటనలో ఉండి తెరవెనుక నుంచి రాజకీయం నడిపిస్తున్నట్టు, ఇన్నాళ్లు ఈటలకు అనుకూలంగా ఉన్న కొందరిని వ్యతిరేకంగా మార్చి ఎగదోసినట్టు ప్రచారం జరుగుతున్నది. సీనియర్‌ నేతల భేటీలో పార్టీలో ఈటలకు ప్రమోషన్‌పైనే ప్రధానంగా చర్చ జరిగిందని తెలిసింది.
ఈటల రాజేందర్‌ తమని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఢిల్లీ నుంచి చక్రం తిప్పాలని చూస్తున్నారని ఆ నేతలు ప్రధానంగా ఆరోపణలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ ఉండగా..ఢిల్లీకి వెళ్లి మరీ పదవుల మార్పుపై లీకులు ఇవ్వడాన్ని ఖండించినట్టు తెలిసింది. ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ప్రచార సారథ్య బాధ్యతల పదవి అప్పగింత చర్చ ఈటల మెడకు చుట్టుకుంటున్నది. బీజేపీలో ఏకాకిని చేస్తున్నది. మరోవైపు మొన్నటిదాకా బండికి వ్యతిరేకంగా ఉండి సడన్‌గా ప్లేటు ఫిరాయించిన ఈ నేతలు రానున్నకాలంలో ఆ పార్టీలో ఎంత మంది ఉంటారనేదీ ప్రశ్నార్థకమే. పార్టీలో ఒకదాని వెనుక ఒకటిగా జరుగుతున్న పరిణామాలు బీజేపీ జాతీయ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి.

Spread the love