పచ్చబొట్టు ఆదివాసీల ఆత్మ గౌరవ సూచిక

Tattoo is an indicator of self-esteem of the tribalsనుదుటి మీద బొట్టు పెట్టుకోవడం భారతీయతే కాదు.. చక్కని ఆరోగ్య హేతువు కూడా. బొట్టు కొద్దికాలం వుండిపోతుంది. కాని కలకాలం చెరిగిపోకుండా కడదాకా వుండేది కేవలం ‘పచ్చబొట్టు’ మాత్రమే. ఈ తరం వారికి పచ్చబొట్టు అంటే.. ఒంటిపై వేయించుకొనే ఫ్యాషన్‌ చిహ్నమని.. టాటూ పేరుతో చిత్రించుకొనే మాడ్రన్‌ డిజైన్‌ అని భావిస్తారు. కాని నిన్నటి తరం వారికి అది జీవితాంతం గుర్తుండిపోయే ఓ పదిల జ్ఞాపకం. ఆదివాసీలకైతే అదో సంప్రదాయం.
పచ్చబొట్టు ఆదివాసీ ఆడబిడ్డల పాలిట గౌరవ చిహ్నమే కాదు, ఒకప్పుడు వారి పాలిట ఆత్మరక్షణ కవచమై ఆదిమజాతిని కాపాడింది కూడా. అందుకే ఆదివాసీలు నేటికీ పచ్చబొట్టు ధరిస్తూ, ఆ సంప్రదాయాన్ని కాపాడుకుంటున్నారు. తమ వారసత్వ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు. ఈ పచ్చబొట్లు అనేవి ఆదివాసీ అమ్మాయిలకు అందం కోసమే కాక, తమ జాతి గుర్తింపు కోసం ఉపయోగపడే సాంస్కృతిక చిహ్నాలు. తమ జాతి రక్షణ కవచాలు కూడా అవే! ఆనాడు తమ జాతిని, శత్రురాజుల నుండి రక్షించిన పచ్చరంగునే ‘పచ్చబొట్టు’ పేర ముఖంతో పాటు శరీరంలోని వివిధ అవయవాల మీద రకరకాల ఆకృతులతో అలంకరించుకుంటున్నారు. గిరిజనుల్లో పచ్చబొట్టు తోటి, కోలాం అనే తెగలోని స్త్రీలకు మాత్రమే ఒకప్పుడు పరిమితమైన కళ. నేడిది విశ్వవ్యాప్తం అయినది.
అనేక గిరిజన తెగలు నాటి సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే, ఇప్పటికీ ఆరోగ్యపరంగా మంచిదని పచ్చబొట్లు పొడిపించుకోవడం విశేషం. పచ్చబొట్లు ఎంత ఎక్కువగా పొడిపించుకుంటే అంతటి ధైర్యవంతులుగా సమాజంలో గౌరవించబడతారని వారి ప్రగాఢ నమ్మకం. ఈ పచ్చబొట్టు పొడిపించుకోవడానికి ధైర్యంతో పాటు ఓపిక కూడా అవసరం. సన్నని సూదులతో చర్మంపై గుచ్చుతూ పొడిచే సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతాయి. ఎలాంటి మత్తుమందు అవసరం లేకుండానే ఆ బాధను భరించి తమ సంస్కృతిలో భాగమైన పచ్చబొట్లు పెట్టుకోవడం నిజంగా సాహసం అనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని ఆదివాసులు వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. విభిన్న తెగలకు చెందిన ఆదివాసీ గిరిజనులను పచ్చబొట్టు ద్వారా ఎవరు ఏ తెగకు చెందిన వారో గుర్తించవచ్చునట! భిల్లుల జాతిలో స్త్రీలు పెళ్లికి ముందు పక్షి ఆకారపు పచ్చబొట్టును కళ్లదగ్గర, కణత ప్రాంతంలో పొడిపించుకుంటారు. ఇలా చేయడంతో వారిలో ఒక విధమైన భద్రతాభావం పెరగడమే గాక శుభసూచకంగా కూడా భావిస్తారు. అక్కడి తెగవారు మాత్రమే కంటి వద్ద తేలు బొమ్మలు పొడిపించుకుంటారు. తాము చేసే మంచి పనులకు గుర్తుగా చనిపోయిన తరువాత కూడా ఇవి ఉంటాయని వారి నమ్మకం. ప్రత్యేకించి గోండు తెగ గిరిజనులు మగవారు మోకాళ్లు మోచేతులపైన వీటిని పొడిపించుకుంటారు. స్త్రీలైతే పచ్చబొట్లపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. పచ్చబొట్లలో ఎక్కువగా జంతువులు, మనిషి బొమ్మలు వేయించుకోవడం చాలా ఇష్టం.
మొదట బస్తర్‌ ప్రాంత వనవాసీ స్త్రీలకు ఈ పచ్చబొట్లు అంటే మక్కువ ఎక్కువ. విదర్బ ప్రాంతంలోని మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్‌, ఒడిశాలో నివసిస్తున్న గిరిజనులు కూడా పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. పచ్చబొట్లకు వాడే రంగులు సహజసిద్ధమైన వనమూలికలు కాబట్టి వాటిని పొడిపించుకోవడం వల్ల అందానికి అందంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుందని నమ్మకం. మోకాళ్ల నొప్పులు, మోచేతుల నొప్పులు, తలనొప్పితో పాటు నరాల సంబంధమైన వ్యాధులకు కూడా పచ్చబొట్టు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుందని వారు బావిస్తారు. పక్షవాతం వంటి భయంకర వ్యాధుల బారిన పడకుండా పచ్చబొట్లు రక్షిస్తాయని వారు అనుభవ పూర్వకంగా చెబుతున్నారు. ‘దేల్‌ ఖండ్‌’ తెగవారి నమ్మకం ప్రకారం స్త్రీ చనిపోయేటప్పుడు ఆమె వద్ద మిగిలే ఏకైక ఆస్తి ‘పచ్చబొట్టు’ మాత్రమేనని నమ్ముతారు. ఎక్కడైతే అభద్రతా భావం ఏర్పడుతుందోనని అనుమానం కలిగితే అక్కడి మహిళలందరూ పచ్చబొట్లు పెట్టుకోవాల్సిందేనట! ఏదైనా అనారోగ్యంగా వున్నప్పుడు, ప్రభావిత భాగాలపై పచ్చబొట్లు వేసుకునే సంప్రదాయం గిరిజనులకు పూర్వం నుండీ ఉంది. పూర్వం తమ పిల్లల్ని గుర్తు పట్టేందుకు శిశువుకు మూడు నెలలు రాగానే పచ్చబొట్లు వేసేవారు. కవల పిల్లలైతే ఖచ్చితంగా ఒకరికైనా వేయాల్సిందే. ఇందుకు వారాంతంలో జరిగే సంతలు, గ్రామదేవతల ఉత్సవాలను ఈ పచ్చబొట్లు పొడిపించు కోవడానికి ఉపయోగించుకునేవారు. పచ్చబొట్లు వేసే గిరిజన మహిళలను ‘బిరుదోళ్లు’ అని పిలుస్తారు.
పచ్చబొట్లను తయారు చేసే విధానం తెలుసుకుందాం. సన్నని మూడు సూదులను దగ్గరగా చేర్చి చేతికీ పట్టుకొనేలా దారంతో చుట్టగా చుట్టి.. పెద్దేగి (ఒక అడవి జాతి) చెట్టు బెరడును తెచ్చి చిన్న కుండలో వేసి మాడిపోయేవరకు వేడిచేస్తే పచ్చని రంగు వస్తుంది. దానిని సన్నటి కట్టెపుల్లతో శరీరంపై మొదట ఆకారం వేసి, ఆముదం నూనెను, ఆ రంగులో ముంచి శరీరంపై సూదితో పొడుస్తారు. దీనితో పచ్చబొట్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది క్రమశిక్షణ, ఓర్పుతో వేస్తుంటారు. మొదట చిత్రమాల ఆకులరసంతో పచ్చబొట్లు మొదలు పెట్టారు. ఇది తయారు చేసుకునేందుకు వేరేవేరు పద్ధతులు వాడుతుంటారు. కొందరు పాము చర్మం కాల్చి బూడిద చేసి దానిని అవిశనూనెలో కలిపి పచ్చబొట్టు తయారుచేస్తారు. కొందరు పచ్చని ఆకులు, దొండ ఆకులు రసాన్ని తీసి దీపపు మసి చేత కర్రలు కాల్చగా వచ్చిన బొగ్గుల మసిని కలిపి దీనిని తయారుచేయడం మరో పద్ధతి. సాధారణంగా మహిళలే ఈ పచ్చబొట్లు వేయడంలో తర్పీదు పొంది, వారే ఒకరికి ఒకరు పొడుచుకుంటారు. పచ్చబొట్లు వేయడానికి వారికి దసరా నుండి సంక్రాంతి పండుగల మధ్య అనుకూల సమయం.
పురాణం ప్రకారం ఆదిదంపతులైన శివపార్వతుల కల్యాణంలో తోటీ గిరిజనులు పచ్చబొట్టు వేశారని, పార్వతికి నుదుటిపై పచ్చబొట్టు వేశాకే వివాహం జరిగిందని చెబుతుంటారు. ఇదే సంప్రదాయాన్ని అసిఫాబాద్‌ జిల్లాలోని రాజ్‌ గోండు అమ్మాయిలు పెళ్ళిపీటలు ఎక్కేముందు నుదుటిపై సూర్యచంద్రులు ఆకారంలో పచ్చబొట్టు వేయించుకునేవారు. మూడు నెలల శిశువుకు దిష్టి బొమ్మతో మొదలై వద్దుల వరకు మహిళల చేతులపై దైవ చిహ్నలు, నవగ్రహాలు, పుష్పాలు, నచ్చినవారి పేర్లు వంటివి సందర్భాన్ని బట్టి వేసుకునేవారు. ఈ పచ్చబొట్ల సంప్రదాయం క్రీ.పూ.1400 సంవత్సరాల నుండి ఉన్నట్లు తెలుస్తోంది. ”పచ్చబొట్టూ చెరిగి పోదులే …” అని ఒక రచయిత పాటలో వర్ణిస్తే, నాడు ఆదివాసీలపై పరిశోధనకు గాను ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాకు వచ్చిన విదేశీ పరిశోధకులు ప్రొఫెసర్‌ హైమండార్ఫ్‌, మైఖేల్‌ యార్క్‌ వంటివారు తమ రచనలు, డాక్యుమెంటరీల్లో పచ్చబొట్టును ప్రస్తావించారు. హైదరాబాద్‌ లోని ఐఐటి మరియు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ విద్యార్థులు పచ్చబొట్టుపై 2020 సంవత్సరంలో అధ్యయనం చేసి, పచ్చబొట్టుకు తొలితరం వారసులైన తోటి తెగవారు ప్రస్తుతం పదివేల మంది మాత్రమేనని తేల్చారు.
ఈ పచ్చబొట్ల సంప్రదాయం విదేశాల్లో ముఖ్యంగా ఆసియా ప్రాంతంలోని గిరిజనుల్లో అధికంగా కనిపిస్తుంది. కేవలం గిరిజనులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని తెగల్లో ఈ పచ్చబొట్లు పొడిపించుకోవడం నేడు సర్వసాధారణం. అయినప్పటికీ ఆధునిక కాలంలో నొప్పిలేని కృత్రిమ పచ్చబొట్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. మొత్తం మీద పచ్చబొట్ల సృష్టికర్తలు వనవాసీలు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. గిరిజన ప్రాంతాలకు వలసలు పెరగడంతో నేడు గిరిజనేతరులకు కూడా ఈ ఆచారం అలవాటు పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1980 – 1990 దశకం మధ్యలో తీవ్ర వాదం ప్రబలిన సందర్భంలో కొన్ని అవాంఛనీయ నిర్బంధాల వల్ల తమకు గుర్తింపు చిహ్నాలు కనిపించవద్దని ఆదివాసులు పచ్చబొట్లకు దూరం అయినట్లు తెలుస్తోంది. నేటి సమాజంలో జరిగే కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు, కొన్నిచోట్ల మహిళలకు జరిగే అవమానాల వల్ల పచ్చబొట్లను తిరస్కరిస్తున్నట్లు బోగట్టా! ఇలాంటి కారణాల వల్ల ఎక్కువ మంది మహిళలు పచ్చబొట్టుపై ఆసక్తి చూపడం లేదు. భవిషత్తు తరాలకు ఈ కళ అందితేనే పచ్చబొట్టు పదిలంగా ఉంటుంది. తరతరాల సంప్రదాయాలు రక్షించ బడితేనే పచ్చబొట్టు సంప్రదాయం కూడా పునద్ధర్శనమవుతుంది.
– గుమ్మడి లక్ష్మీనారాయణ, 9491318409

Spread the love