– నాకు సీఎం పదవి ముఖ్యం కాదు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశ ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు. కూటమిలో ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల ఫలితాల బలాబలాలను బట్టి నిర్ణయిస్తామని అన్నారు. తమకు అండగా నిలిచేవారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగాలు లేవని, ఉద్యోగులకు 1న జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. డేటా చౌర్యం జరుగుతోందని ఆరోపించారు.
రోజుకి రూ.160 జీతం ఇచ్చి పెట్టుకున్న ప్రయివేటు వ్యక్తులతో ప్రజల డేటా అంతా చౌర్యం చేస్తున్నారని విమర్శించారు. ఆధార్, వేలిముద్రలు, ఐరిష్ డేటా అంతా తెలంగాణలో నిక్షిప్తం చేస్తున్నారన్నారు.
ఈ ప్రజా వ్యతిరేకతను ఎదురించే వారు కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే జనసేనకు ఏపీలో ప్రజల నుంచి మద్దతు వస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నారు. మీడియాలో కనిపిస్తున్న దానికి వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని చెప్పారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రం పది శాతం వడ్డీతో రుణాలు తీసుకొచ్చి రాష్ట్ర సొమ్మును ధారాదత్తం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.