– ప్రస్తుత రిజర్వేషన్ల ఆధారంగానే డీఎస్సీ ఫలితాలు
– పాఠశాల విద్యాశాఖ అధికారుల సమాలోచన
– ఎస్సీ వర్గీకరణ మార్గదర్శకాలు వచ్చాక అమలుపై స్పష్టత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలవుతుందా? లేదా?అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతున్నది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకూ వర్గీకరణను వర్తింపజేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామన్నారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్‌కూ ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని అందరూ ఆశించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే వచ్చింది. దాని ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయాలి. అయితే ఇప్పటి వరకు అవి విడుదల కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. వారు తిరిగి తెలంగాణకు వచ్చిన తర్వాతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశమున్నది. పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం డీఎస్సీ నోటిఫికేషన్‌లో ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగానే ఫలితాలు ప్రకటించాలని భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని సమాలోచన చేస్తున్నారు. ఈనెలాఖరులోగా డీఎస్సీ ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఒకవేళ డీఎస్సీ ఫలితాలు విడుదల కాకముందే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు వస్తే ఏంటనేది వేచిచూడాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను మార్చి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కానందున నోటిఫికేషన్‌లో ఉన్న రిజర్వేషన్లు, నిబంధనల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతనెల 18న ప్రారంభమైన డీఎస్సీ రాతపరీక్షలు సోమవారంతో ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యా ప్తంగా 2,79,957 మంది దరఖాస్తు చేయగా, 2,45,263 (87.61 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. 34,694 (12.39 శాతం) మంది గైర్హాజర య్యారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేష న్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.