– డీఎస్సీకి మూడు నెలల సమయం కేటాయించాలి
– తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి
– జేఏసీ నేతలు, నిరుద్యోగుల అరెస్ట్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
డీఎస్సీ కింద 25 వేల టీచర్ పోస్టులను పెంచి భర్తీ చేయాలని, డీఎస్సీకి మూడు నెలల సమయం కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులు, జేఏసీ నేతలు సోమవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సైఫాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిం చారు. ఈ క్రమంలో పోలీసులకు నిరుద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత జరిగింది. అనంతరం పలువురు జేఏసీ నేతలు, నిరుద్యోగులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఈడీ చేసిన నిరుద్యోగులు 4 లక్షల మందికిపైగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పీఆర్సీ రిపోర్టు ప్రకారం రిటైర్మెంట్ వల్ల ఏర్పడిన 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 4,900 పోస్టులు భర్తీ చేయాలని కోరారు. 25 ఏండ్లుగా ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదని, 90 శాతం ఖాళీలు ఏండ్ల తరబడి పెండింగ్ ఉంటున్నాయని అన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 10 వేల పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ జీఓ ప్రకారం ప్రతి పాఠశాలకూ ఒక పీఈటీ టీచర్ ఉండాలని తెలిపారు. 20 ఏండ్లుగా ఖాళీగా ఉన్న 5 వేల ఆర్ట్-క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అలాగే, 4 వేల మంది కంప్యూటర్ టీచర్లను నియమించాలని, ప్రతి పాఠశాలకూ ఒక జూనియర్ అసిస్టెంట్ ఉండాలని అన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సర్క్యులర్స్, ఇతర కరస్పాండెంటు చేయడానికి, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి, విద్యార్థుల హాజరు తదితర వివరాలు ఎప్పటికప్పుడూ తల్లిదండ్రులకు తెలుపడానికి ప్రతి పాఠశాలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టు అవసరమని చెప్పారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 15 వేల అటెండర్, స్వీపర్ పోస్టులనూ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని కేటగిరీల పోస్టులను భర్తీ చేసి పాఠశాల విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ యువతతో నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ యువజన సంఘం నాయకులు పగిళ్ళ సతీష్, నిఖిల్, రాందేవ్, ప్రీతం, శివరాం, శ్రీనివాస్, స్వాతి, శశి, నిరుద్యోగులు పాల్గొన్నారు.