ఉపాధ్యాయులు – విలువలు

ఉపాధ్యాయులు - విలువలుప్రపంచీకరణ నేపథ్యంలో స్వరూప స్వభావాలు మారిపోయిన విద్యాలయాల్లో అలనాటి గురు శిష్య సంబంధాలు కనుమరుగై పోయాయి. ఆర్థిక ప్రయోజనాలే ప్రాతిపదికగా విద్యాబోధన, విజ్ఞానార్జన జరుగుతున్న తరుణంలో ఉపాధ్యాయులు కొంతైనా ఆత్మావలోకనం చేసుకునేందుకు…
సాధారణంగా టీచర్లు ఎక్కువగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇది ఎప్పుడూ పాఠాలు బోధించే పనిలో ఉండడం వల్ల అలవాటయి ఉండవచ్చు. అందుచేత కాస్త సమయం చిక్కినా, పిచ్చాపాటీ మాట్లాడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ప్రతి స్కూల్లోనూ టీచర్లకు ప్రత్యేకంగా స్టాఫ్‌రూమ్‌ ఉంటుంది. అక్కడ తప్పిస్తే, కారిడార్లలో కానీ ఎక్కడ పడితే అక్కడ కబుర్లు చెప్పుకోవడం వల్ల పిల్లల దష్టిలో మర్యాదను కోల్పోతారు. ముఖ్యంగా ఎడాపెడా కబుర్లు చెప్పుకుంటూ గడిపే తమకు, ఉపాధ్యాయులకు మధ్య పెద్ద తేడా లేదనే భావనకు గురవుతారు.
ఇతరుల గురించి కబుర్లు అసలే వద్దు : కబుర్లు చెప్పుకునే సందర్భాల్లో, ఎక్కువ భాగం గాసిప్స్‌కి ఆసక్తి చూపిస్తుంటారు. గాసిప్స్‌లో నిజం ఉండదు. కానీ అవి జెట్‌ ప్లేన్‌ కన్నా వేగంగా ప్రయాణం చేస్తాయి. అబద్ధాలు, పుకార్లు అలా అలా ప్రయాణం చేసి, చివరకు లేనిపోని చర్చలకు దారి తీస్తాయి. ఇందువల్ల పుకార్లకు లోనయిన వ్యక్తులు బాధపడడమే కాకుండా, గాసిప్స్‌ పాల్గొన్న టీచర్ల స్వభావంపై ఒక దురాభిప్రాయం కలుగుతుంది. కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం, వీటిపట్ల అనవసర ఆసక్తిని కనపరచడం వల్ల కూడా ఈ అలవాటు కొనసాగుతుంటుంది. గాసిప్స్‌ టీచర్ల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
పితూరీలు వద్దు… : కబుర్లు చెప్పుకునే సమయంలో ఎక్కువ భాగం గాసిప్స్‌, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం చాలా తప్పు. ఇవ్వాళ పితూరీలు ఎవరిమీదో చెప్పుకున్నట్లు కనిపించినా రేపు మీమీద కూడా చెప్పుకోవచ్చు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని స్కూళ్ల యాజమాన్యం పితూరీలను ప్రోత్సహిస్తారు. ఉపాధ్యాయుల మధ్య పొరపొచ్చాలను ఏర్పరిస్తే, వాళ్లలో కొంతమంది తమకు గూఢాచారులుగా పని చేస్తారనే భావనతో, టీచర్ల మధ్య ఏం జరుగుతుందో, ఎవరు ఎలాంటివారో రహస్యంగా తెలుసుకోవాలనే కుతూహలాన్ని చూపిస్తారు యాజమాన్యం. ఇది నిజంగా అపోహే ! ఎందుకంటే సిబ్బంది నిజాయితీని కనిపెట్టడానికి మంచి మార్గాలు ఉన్నాయి. వాటిని వదిలిపెట్టి అడ్డదారులు వెతకవద్దు. ఈ విషయంలో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి.
పిల్లల గురించి…: ముఖ్యంగా ఉపాధ్యాయులు చేయకూడని పని, విద్యార్థుల మీద తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పుకోవడం. పిల్లల గురించి కానీ, వాళ్ల తల్లిదండ్రుల గురించి కానీ చర్చలు పెట్టుకోరాదు. ఇది విన్న లేత మనసులు చాలా నొచ్చుకుంటాయి. ఏ విద్యార్థయినా తమ కుటుంబ సభ్యుల గురించి ‘వ్యక్తిగత’ విషయాలను వేరెవరో మాట్లాడుకోవడం ఇష్టపడరు. అలా చేసేది తమ టీచర్లే అయితే వారి మనసులు ఇంకా నొచ్చుకుంటాయి. ఇది స్కూల్లో ఉండకూడని వాతావరణం. ఎవరయినా మీ ఎదుట అలా చేస్తుంటే వారిని సున్నితంగా వారించండి. మాట తప్పించండి. ఒకవేళ మాట్లాడక తప్పని పరిస్థితిలో పిల్లల సమక్షం లేని ప్రదేశాలలో విడిగా సంభాషించుకోవడం మంచిది.
పిల్లల ఎదురుగుండానే వారి తల్లిదండ్రులకు చెడుగా చెప్పకండి : సాధారణంగా విద్యార్థిలోని లోపాన్ని వాళ్ల తల్లిదండ్రులకు చెప్పాల్సి వస్తే, వారికి కబురు పెడతారు. క్లాస్‌ రూంలో పిల్లాడిని దోషిలా నుంచోబెట్టి, ఫిర్యాదుల లిస్టును ఏకరువు పెడతారు. పిల్లల సైకాలజీ కోణంలో చూస్తే ఇది వారికి చాలా ఇబ్బంది కరమయిన పరిస్థితి. పిల్లలు తమ తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల ఎదుట న్యూనతకు గురికావడాన్ని ఇష్టపడరు. అటువంటి పని చేసే ఉపాధ్యాయుల పట్ల ద్వేషభావాలతో వుంటారు. అలాగే పేరెంట్స్‌ కూడా పైకి చెప్పలేకపోయినా తమ పిల్లలు ఇలా అందరి ముందు విచారణకు గురికావడాన్ని ఇష్టపడరు. పిల్లల పట్ల మీరు బాధ్యాతాయుతంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. ఆ విశ్వాసానికి మీ ప్రవర్తన కారణంగా చేటు కలుగుతుంది. అలాగే పిల్లల చదువు, క్రమశిక్షణ విషయాల్లో టీచర్లే ఫిర్యాదు చేయడం, వత్తి నైపుణ్యానికి మాయని మచ్చ అవుతుంది. మిమ్మల్ని మీరే తెలివితక్కువ వారిగా బయట పెట్టుకున్నవారవుతారు. అప్రమత్తం చేయాల్సిన లోపం పిల్లల్లో కనిపిస్తే, ఆ తల్లిదండ్రులతో విడిగా మాట్లాడడం మంచిది. ఉదాహరణకు ఒక విద్యార్థి ప్రవర్తనలో అటెన్షన్‌ డిఫిసెట్‌ డిజార్డర్‌ లక్షణాలను గ్రహిస్తే… దాన్ని తల్లిదండ్రుల దష్టికి తప్పకుండా తీసుకెళ్లాలి. అయితే వారితో ఏకాంతంగా మాట్లాడాలి. ఒక వత్తి నిపుణులుగా మీ బాధ్యతలను సుహద్భావ వాతావరణంలో నిర్వర్తించడం మీ ప్రథమ కర్తవ్యం.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

Spread the love