– జట్టుతో పాటు ప్రయాణించని కోహ్లి
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంది. ప్రపంచకప్ వార్మప్ షెడ్యూల్‌లో భాగంగా గువహటిలో ఇంగ్లాండ్‌తో ప్రాక్టీస్ గేమ్ వర్షం కారణంగా సాధ్యపడలేదు. దీంతో నెదర్లాండ్స్‌తో మంగళవారం రెండో వార్మప్ మ్యాచ్‌లోనే రోహిత్‌సేన మ్యాచ్ ప్రాక్టీస్‌కు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గువహటి నుంచి ప్రత్యేక విమానంలో రోహిత్‌సేన తిరువనంతపురం చేరుకుంది. విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు ‘ఇండియా.. ఇండియా’ అంటూ నినాదాలు చేస్తూ భారత క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌కు 15 కిమీ దూరంలో కోవలంలోని ఓ బీచ్ రిసార్ట్‌లో టీమ్ ఇండియాకు బస ఏర్పాటు చేశారు. వాతావరణం అనుకూలిస్తే సోమవారం ఉదయం భారత క్రికెటర్లు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొననున్నారు. ఇక టీమ్ ఇండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి జట్టుతో పాటు తిరువనంతపురానికి రాలేదు. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి ఆగిపోయినట్టు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ సమయానికి కోహ్లి జట్టుతో చేరతాడని సమాచారం.