పెన్సిల్ మీద కూర్చుని
ఎగురుతూ బడికెళ్తున్న పిల్లల బొమ్మను
ఇప్పుడు ఎక్కడ చూసినా
పదిహేను ఏళ్ళుగా కొంచెం కొంచెం
చెక్కబడుతున్న పెన్సిల్లలాంటి
వాళ్ళ బతుకు చిత్రాలే కన్పిస్తున్నాయి…
సర్వశిక్ష అభియాన్ పథకం సాక్షిగా!
ఇన్నాళ్లుగా చెదరని చిరునవ్వుతో
మన మధ్యే తిరుగుతూ ఉన్న
వాళ్ళ కళ్ళలోకి చూస్తే ..
అందరూ చదువాలనే అక్షర యజ్ఞంలో
సమిధలై కాలిపోతున్న
వాళ్ల జీవితాలు కన్పించడం లేదూ?!
ఏదో ఒక ఉదయం
కాసింత ఉద్యోగ భద్రతను
నిరీక్షణ ఫలంగా ఇవ్వక పోతుందా అని
నిద్ర లేని రాత్రులను మోస్తున్న
వాళ్ళ హదయ ఘోషలు
మన చెవుల్లో మారుమమోగడం లేదు?!
విద్యా వ్యవస్థా యంత్రం సజావుగా సాగేందుకు
ఒంట్లోని ఓపికనంతా ఇంధనంగా
ధార పోస్తున్న వాళ్ళ దేహాల్లో
కనీస వేతనం లేక
కాలిపోతున్న కొవ్వొత్తులు కనిపించడం లేదు?!
అర్హతలు గల చదువు
ఏళ్ళ తరబడి శ్రమ
అయినా ఆ సేవలకు ఓ గుర్తింపు కోసం
ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఇంకెంత కాలం
గొంతెత్తి అరవాలి?!
ఈ అర్ధాకలి రోజులు అంతమయ్యేలా
సమాన పనికి సమాన వేతనం కోసం
కనీస హక్కులు అందించే
ఆ సంతకానికి ఇంకెప్పుడు కదలికొస్తుంది?!
క్రమబద్దీకరణ కిరణాలతో
ఆ బతుకుల్లో భరోసా వెలుగుల్ని నింపే
బంగారు తెలంగాణ ఇంకెప్పుడని
మూగబోయిన గొంతులను
మానవ వనరుల కేంద్రాలన్నీ
మానవత్వం చూపమని మౌనంగా
నిలదీస్తున్నట్లుగా లేదూ?!….
( కనీస హక్కుల కోసం పోరాడుతున్న సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులకు సంఘీభావం గా…)
– రహీమొద్దీన్, 9010851085