గురుకులంలో కండ్ల కలకలం..!

– వేగంగా విస్తరిస్తున్న బ్యాక్టీరియా
– కంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలు..పెద్దలు
– అత్యధిక కేసులు నమోదు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, జైపూర్‌
మంచిర్యాల జిల్లా జైపూర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు కండ్ల కలకతో బాధపడుతున్నారు. ఈ నెల 24తేదీన తొలుత పది మంది పిల్లలకు కండ్ల కలక వచ్చింది. విద్యార్థులు పక్క పక్కనే కూర్చోవడంతో మూడు రోజుల్లోనే 250మందికి వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి వైద్యాధికారులు పాఠశాలలో మెడికల్‌ క్యాంపు నిర్వహించి చికిత్స అందించారు. పిల్లలంతా ఒకే దగ్గర ఉండటంతో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం అనేక చోట్ల ఈ వ్యాధితో పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ వ్యాధి సాధారణమైనదే అయినా.. వారం రోజులపాటు బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రస్తుతం విద్యాసంస్థల్లోనే కాకుండా ఇతర జన సమూహాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఈ బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళనకరంగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. కంటి గుడ్డు చుట్టూ ఉండే తెల్లని పొర, కంటి రెప్పల వెనుక ఉండే పొరను కంజెటైనా అంటారు. కండ్లు తెరిచి ఉండటంతో దుమ్ము, ధూళి, వేడి, చలి, నీటితో ఇన్‌ఫెక్షన్‌తో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా బ్యాక్టీరియా ద్వారా సంక్రమించిన కండ్ల కలక వారం రోజుల్లో తగ్గిపోతుంది. కండ్ల కలక వచ్చిన వారిలో కండ్లు ఎర్రబారటం, నీరు కారడం, కంటి రెప్పలు వాపు లేదంటే ఉబ్బిపోవడం, నిద్రలో కనురెప్పలు అంటుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
వాతావరణ మార్పులే కారణమా..?
ఈ కండ్ల కలక వ్యాధి వేగంగా విస్తరించేందుకు వాతావరణ మార్పులే కారణమని తెలుస్తోంది. ఈ వ్యాధి ప్రతి ఏటా సాధారణంగా వచ్చేదే అయినా ఈసారి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. భారీ వర్షాలు కురవడం.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఈ బ్యాక్టీరియా వేగంగా విస్తరించేందుకు కారణమైందని తెలుస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తుండటంతో పిల్లలు, పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాంటీబాయాటిక్‌ మందులు వాడితే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. కంటిని శుభ్రంగా ఉంచుకోవాలని, బయటికి వెళ్లి వచ్చిన తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖం, కండ్లను కడుక్కొని మెత్తటి శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలని సూచిస్తున్నారు.
అందరికీ తగ్గిపోయింది
డా.అనిల్‌కుమార్‌, మెడికల్‌ ఆఫీసర్‌, జైపూర్‌
కండ్ల కలక వ్యాధి ప్రస్తుతం అంతటా వస్తోంది. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు 250మంది విద్యార్థులు ఈ వ్యాధితో ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలో ఇప్పటి వరకు తొమ్మిది వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాం. ప్రస్తుతం విద్యార్థులందరూ కోలుకున్నారు. ఆరుగురు విద్యార్థులకు మాత్రమే చికిత్స కొనసాగిస్తున్నాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Spread the love