మావోయిస్టులకు టెక్నాలజీ దెబ్బ

Technology is a blow to Maoists– ఐదేండ్లలో అతి భారీ ఎన్‌కౌంటర్‌ ఇదే
– మృతి చెందిన 29 మంది మావోయిస్టుల్లో సగానికి పైగా మహిళలే..
– 27 లక్షల రివార్డు గల శంకర్రావు మృతి
– ముగ్గురు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు : బస్తర్‌ ఐజీ పి.సుందర్‌ రాజ్‌, కాంకేర్‌ ఎస్పీ కళ్యాణ్‌ ఐలెసెల్లి
నవతెలంగాణ-చర్ల
టెక్నాలజీ మావోయిస్టుల కొంప ముంచిందని పలువురు విశ్లేషిస్తున్నారు. టెక్నాలజీని ద్వారా మొబైల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌, సిగల్‌ క్యాచింగ్‌తోపాటు కొరియర్‌ వ్యవస్థను పోలీసులు ఉపయోగించుకొని మావోయిస్టుల స్థావరాలను గుర్తించి మట్టుపెట్టారని అంటున్నారు. ఇదే విషయం మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ను సూచిస్తుంది. కమాండర్‌ స్థాయి, ఏరియా కమిటీ కార్యదర్శి మావోయిస్టులకు నాలుగైదంచుల భద్రత ఉన్నప్పటికీ పోలీసులు చాకచక్యంగా మావోయిస్టుల స్థావరంపైకి వెళ్లి ఎన్‌కౌంటర్‌ చేశారు. దీంతో గడిచిన 15 ఏండ్లలో ఎన్నడూ ఇలాంటి నష్టం మావోయిస్టులకు కలగలేదని పలువురు చర్చించుకుంటున్నారు.
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో.. మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ ఆర్‌కేబీ డివిజన్‌ కమిటీ కార్యదర్శి, రూ.27 లక్షల రివార్డు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన సుగులూరి చిన్నాన్న అలియాస్‌ శంకర్రావు ఉన్నట్టు బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ తెలిపారు. అంతేకాకుండా దండకారణ్య స్పెషల్‌ జోన్‌ స్టేట్‌ మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జి రాందర్‌ అలియాస్‌ మజీదేవ్‌ కూడా మరణించినట్టు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. మృతుల్లో మసీదేవ్‌ భార్య లలిత కూడా ఉన్నట్టు తెలుస్త్తోంది. మంగళవారం మధ్యాహ్నం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాకులు దూరని కారడవిలో కాల్పులు మొదలై రాత్రి వరకు హౌరాహౌరీగా జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటికి 29 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయని బస్తర్‌ ఐజీ పి.సుందర్‌ రాజ్‌, కాంకేర్‌ ఎస్పీ కళ్యాణ్‌ ఐలెసెల్లి తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలున్నట్టు తెలిసింది. పలువురు జవాన్లు కూడా గాయపడ్డారు. మావోయిస్టులు పక్కా స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 19 నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించాలని ప్రణాళికలు వేస్తున్నారని తెలిసింది. వాటిని తిప్పికొట్టేందుకే పోలీసు బలగాలు పక్కా ప్రణాళికతో అడవులను జల్లెడ పడుతున్నాయి. ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 70 మంది మావోయిస్టులు మృతిచెందారు. కాగా దండ కారణ్యంలో ప్రతి ఆదివాసీ గ్రామంలో భద్రతాబలగాలు పోలీస్‌ క్యాంపులు పెట్టాలనే యోచనలో ఉన్నాయని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ అడవుల్లో ఎర్రటి రక్తపు టేర్లు పారుతున్నాయని పలువురు వాపోతున్నారు.

Spread the love