
– మేము చేసిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చాం- మంత్రి
– బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో పైన తీసుకొని రావడమే మా లక్ష్యం- మంత్రి
నవతెలంగాణ – భువనగిరి.
తీన్మార్ మల్లన్న విషయంలో తనకు మాట్లాడేంత టైమ్ లేదని.. మాట్లాడం వేస్ట్ అని ఆర్అండ్‌బీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు శుక్రవారం ఆయన భువనగిరిలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్‌లో చూశానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చామని తెలిపారు. బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో పైన తీసుకొని రావడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఖచ్చితంగా 42 శాతం పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వర్గీకరణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తెలిపారు. 90 శాతం ఉన్న జనాభా కోసమే తెలంగాణ వచ్చిందన్నారు. దొరలు, భూస్వాములు ఫామ్ హౌస్‌లో ఉండేందుకు కాదని దుయ్యబట్టారు. ఫామ్ హౌస్‌లో ఉంటూ కులగణలో పాల్గొనకుండా ఉన్న వాళ్లకు మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ లెక్క తాము హడావిడిగా సర్వే చేయలేదని.. తాము చేసిన సర్వే ప్రజల ముందు పెట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాయకులు పిట్టల బాలరాజ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.