మాది బ్రాహ్మణపల్లి గ్రామం. ప్రస్తుతం ఇది రంగారెడ్డి జిల్లాలో బీబీనగర్ మండలంలో ఉంది. 1936, నవంబర్ 7న పుట్టాను. మా అమ్మ లక్ష్మమ్మ, నాన్న రామ చంద్రా రెడ్డి. వీరికి మేము ఐదుగురు పిల్లలం. అన్నయ్య కోదండ రామిరెడ్డి, అక్క శశిరేఖ, తమ్ముళ్లు నర్శింహా రెడ్డి, బుచ్చిరెడ్డి. అన్నయ్య విద్యార్థి దశలోనే జాతీయో ద్యమానికి ఆకర్షితుడయ్యాడు. మొదట ఆర్య సమాజం, తర్వాత ఆంధ్రమహాసభ, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. అప్పట్లో మా జిల్లాకు ‘ఆంధ్ర మహాసభ’ కార్యదర్శిగా కూడా పని చేశాడు. అన్నయ్యే మా అందరినీ కమ్యూనిస్టులుగా తీర్చి దిద్దాడు. ఇంట్లో ఘోషా పద్ధతిని మాన్పించాడు. పెద్దలనెదిరించి నాకూ, అక్కకు చదువుతో పాటు వ్యాయామము, కర్రసాము, సైకిల్ తొక్కడం, ఈత, గుర్రపుస్వారీ వంటివి నేర్పించాడు. మాలో ఆత్మ విశ్వాసం, మానసిక ధైర్యం పెంపొందించి రాజకీయ పరిజ్ఞానానికి పునాది వేసింది మా అన్నయ్యనే.
అన్నయ్య ప్రభావంతో…
మా అక్క శశిరేఖ అన్నయ్య ప్రభావంతో కమ్యూ నిస్టు పార్టీలో చేరింది. దళాల్లో పని చేసింది. విజయ వాడలో మహిళా కార్యకర్తలకు ఇచ్చిన శిక్షణలో పాల్గొంది. అక్క అరెస్టయ్యి రెండేండ్లు జైల్లో ఉంది. అప్పుడు ఆమెకు పదిహేడు ఏండ్లు. అప్పుడు జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలందరికంటే చిన్నది. ఖైదీలందరి తరఫున తమకు పత్రికలూ, పుస్తకాలు ఇవ్వమని, కుట్టు మిషన్లు నేర్పించమని జైలు అధికారులకు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చింది. అధికారులు మిషను తెప్పించి అందరికీ కుట్టడం నేర్పారు. 2012 డిసెంబర్‌లో అక్క చనిపోయింది. మా అన్నయ్య ఊర్లో ఒక పాఠశాల నిర్మించాడు. అందులోనే మేము 6వ తరగతి వరకు చదువుకున్నాం. మా నాన్న పోలీసు పటేల్. మా ఊర్లో మా కుటుంబానిదే పెత్తనం. శిస్తు వసూలు చేయాల్సిన బాధ్యత మా కుటుంబానిదే. కానీ మా అన్నయ్య ప్రభావంతో ఇంట్లో అణచివేత ఉండేది కాదు.
ఆరుట్ల కమల గురించి విని…
ఐదో తరగతి వరకు మా ఊళ్ళో చదువుకుని, ఆరు, ఏడు తరగతులు మా పిన్ని ఇంట్లో ఉండి చదువుకున్నాను. అప్పట్లో ఆరుట్ల కమలాదేవి పెండ్లి చేసుకుని హాస్టల్లో ఉండి చదువుకుంటుందని, ఆమె భర్తతో పాటు సమావేశాలకు వెళుతుందని విని మేము కూడా ఆమెలా ప్రజా సేవకు అంకితం కావా లని ఆరాటపడేవాళ్ళం. ఒకసారి మా ఊరికి దగ్గర లోనే ఒక బహిరంగ సభకు కమలాదేవి వస్తున్నారని తెలిసింది. ఆ మీటింగ్‌కి అన్నయ్య మమ్మల్ని తీసికె ళతానంటే ఇంట్లో వీల్లేదన్నారు. ‘ఊళ్ళో తిప్పుతున్నది చాలక, పొరుగూళ్ళలో కూడా తిప్పితే, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయా? ఎవరు చేసుకుంటారు’ అంటూ చాలా గొడవ చేశారు. ఎలాగో ఒప్పించి మమ్మల్ని తీసుకెళ్ళాడు. అక్కడ మొదటి సారి ‘కష్టజీవి’ బుర్రకథ విని, కమలాదేవిని చూసి చాలా సంతోషించాం.
మొదటి సారి మల్లు స్వరాజ్యంతో…
అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషగా ఉంది. ఇతర భాషలకు సంస్కృతులను అణచివేసేవారు. మధ్యతరగతి వారికి కూడా చదువు అందుబాటులో ఉండేది కాదు. ప్రజల మాతృభాషల్లో విద్య నిషేధం. భూమి కూడా ఎక్కువ శాతం దొరల చేతిలో ఉండేది. పేదలు వెట్టి చేస్తూ దోపిడికి గురయ్యేవారు. వెట్టి పనులు చేయలేకపోతే పెత్తందార్లు, దొరలూ వాళ్ళను తీవ్రంగా హింసించే వారు. మహిళలను ఇష్టం వచ్చినట్టు వాడుకునే వారు. దాంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. చివరకు ఇది మరింత విస్తృతమైన ఆందోళనకు దారితీసింది. ఆంధ్రమహాసభ ఏర్పడిన తర్వాత రావి నారాయణరెడ్డి, మా అన్నయ్య అందులో చేరారు. మా ప్రాంత దళాలన్నింటికి నాయకుడయ్యాడు. 1944లో భువనగిరిలో ఆంధ్ర మహాసభ పద కొండవ సమావేశం జరిగింది. అక్కడే నేను మొదటి సారి మల్లు స్వరాజ్యంను కలుసుకున్నా. వాళ్ళతో పాటు నేనూ వాలంటీరుగా పని చేశా. ఇది నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.
మా ఇంటిని తగలబెట్టి…
సాయుధ పోరాటం ఊపందుకున్న తర్వాత రజాకార్ల దాడులు గ్రామాలపై ఎక్కువయ్యాయి. మా అన్నయ్య జాడ చెప్పమంటూ మా ఇంటిపై కూడా ఎన్నో సార్లు పోలీసులు దాడి చేసేవారు. దాడులు ఎక్కువ కావడంతో మేము హైదరాబాద్‌కు వచ్చేశాం. మేము వచ్చేసిన తర్వాత మా పాలేర్లతో మా ఇంటిని తగలబెట్టించి తర్వాత వాళ్ళందరిని కూడా కాల్చి చంపారు. 1948లో రాజాకార్ల భయం కాస్త తగ్గిందని తిరిగి మా ఊరికి వెళ్ళాం. కాలిపోగా మిగిలిన ఇంటిని బాగు చేసుకుని అందులోనే ఉన్నాం. ఆ సమయంలోనే మా అన్నయ్యకు బాబు పుట్టాడు. ఆ రోజు అన్నయ్యతో పాటు దళాలు కూడా వస్తున్నాయని విని భోజనాలు ఏర్పాటు చేశాం. అది తెలుసుకుని యూనియన్ సైన్యాలు లారీలో వచ్చాయి. దళాలు పారిపోయాయి. ఆ రోజు రాత్రి మా ఇంటిపై మళ్ళీ దాడి చేశారు. మా నాన్నను, అమ్మను, అమ్మమ్మను విపరీతంగా కొట్టారు. దాంతో మళ్ళీ హైదరాబాద్ వచ్చి రహస్య జీవితం ప్రారంభించాం.
అన్నయ్యను చంపేశారు
హైదరాబాద్‌లో మా ఇల్లు సీతాఫల్‌మండీలో ఉండేది. మా ఇల్లే ఓ డెన్‌లా అనిపించేది. మహిళ లకు ప్రత్యేకంగా రాజకీయ శిక్షణా తరగతులు పెట్టేవారు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ జీవిత చరిత్రలు చదివి చర్చించుకునే వాళ్ళం. గోర్కి అమ్మ, టాన్యా, జోయా, రోజన్ బర్గ్ పుస్తకాలు చదివేవాళ్ళం. 1949 జూన్ 6వ తేదీన మా అన్నయ్యను సైనికులు కాల్చి చంపారు. ఆయన చివరి చూపు కూడా మాకు దక్కలేదు. అన్నయ్య మరణం మా కుటుంబాన్ని కుంగదీసింది. నాకు చదువుకోవాలని ఉన్నా పరిస్థితి అనుకూలంగా లేదు. అప్పటికే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీపై సైనిక చర్యలు తీవ్రమయ్యాయి.
కొరియర్‌గా…
ఎనిమిదేండ్ల వయసు నుండే కొరియర్‌గా పని చేసేదాన్ని. మొదటి సారి వెళ్ళేటప్పుడు మధ్యలో పోలీసులు సవాలక్ష ప్రశ్నలు అడిగారు. భయం వేసింది. అయినా ఏవో సమాధానాలు చెప్పి డెన్‌కు వెళ్ళాను. అక్కడ రావి నారాయణరెడ్డి, యస్.వి.కె. ప్రసాదు, పరంజపే, ఎ.ఆర్.వి.చారితో పాటు మరికొందరు ఉన్నారు. నేను తీసుకెళ్ళిన ఉత్తరాలను వారికి ఇచ్చాను. నారాయణ రెడ్డి ‘చాలా ధైర్యంగా వచ్చావు’ అని మెచ్చుకున్నారు. చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాను. మరోసారి కూడా ఇలాగే వెళ్ళ మంటే ఇక వెళ్ళనన్నాను. కానీ బతిమలాడితే వెళ్ళాను. నారాయణరెడ్డి నువ్వు మంచి కొరియర్‌వి, చాలా పెద్ద బాధ్యత నిర్వర్తిస్తున్నావు అన్నారు. నాకు ఇష్టం లేకపోయినా చేస్తుండేదాన్ని.
కఠినమైన పేదరికం
నేను ఉండే డెన్‌లోనే యస్.వి.కె ఉండేవారు. వెళ్ళి ఏడాది దాటినా ఆయన అసలు పేరు నాకు తెలియదు. ఆయన కూడా ఎవరితో పెద్దగా మాట్లా డారు. అయితే నన్ను వివాహం చేసు కుంటానని ఉత్తరం ద్వారా నాకు తెలియజేశారు. మా అక్క, బావకు చెప్పి నారాయణరెడ్డిని సంప్రదించి డెన్‌లోనే పెండ్లి చేసుకున్నాము. 1951లో మా రహస్య జీవితంలోనే పాప శోభ పుట్టింది. అప్పుడు మా డెన్‌పై పోలీసులు నిఘా పెట్టారు. దాంతో పాపను తీసుకుని అనేక ప్రాంతాలు తిరిగాము. డెన్‌లో జీవించేటప్పుడు ఒక్కోసారి కఠినమైన పేదరికాన్ని అనుభవించే వాళ్ళం. అదే సమయంలో యస్.వి.కెను అరెస్టు చేశారు. అది విని కుంగిపోయా. తర్వాత ఆయన బతికే ఉన్నారని తెలిసి అందోళన కొంత తగ్గింది. అలా ఐదేండ్లు రహస్య జీవితం గడిపాను.
ఉద్యమానికే అంకితం
సాయుధ పోరాట విరమణ తర్వాత అందరూ చెల్లాచెదురయ్యారు. దాంతో 1957 లో మోటూరు ఉదయం ఎక్కడెక్కడో ఉన్న మహిళా కార్యకర్త లందరినీ వెదికి తెచ్చి కమిటీ ఏర్పాటు చేశారు. అలా ఏడుగురితో హైదరాబాద్ సిటీ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి నేను అధ్యక్షురాలిగా బాధ్యతలు చూశాను. రాష్ట్ర కమిటి, అలిండియా కమిటీలో కూడా ఉన్నాను. అలాగే సారా ఉద్యమం లో బాగా పని చేశాం. 30 సంఘాలు కలిసి దీని కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీకి రాష్ట్ర కమిటి కార్యదర్శిగా ఉన్నాను. ఆ సమయంలో చాలా మంది మహిళలు మాతో కలిసి వచ్చారు. చివరకు సారాను నిషేధిం చారు. ట్రేడ్ యూనియన్ తో కూడా కలిసి పని చేశాను. ఐదు యూనియన్లకు ప్రెసిడెంట్‌గా ఉండేదాన్ని. నాకున్న సమయం మొత్తం పార్టీ కోసమే కేటాయించాను. ఇప్పటికీ నాకు పని చేయాలనే కోరిక. అయితే ఓపిక లేక పోవడంతో రాలేకపోతున్నాను. అది కాస్త బాధగా అనిపిస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ సాయుధ పోరాటం ఓ చారిత్రాత్మకమైన విప్లవ ఘట్టం. ఇందులో స్త్రీలు నిర్వహించిన పాత్ర మహౌన్నత మైనది. అందులో నేనూ, మా కుటుంబంలోని వారు కూడా పాల్గొన్నామన్న తృప్తి నాలో ఉంది. దీనిని నా జీవితంలో గర్వించదగిన విషయంగా నేను అనుకుంటాను. నా పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం నేను సి.ఆర్.ఫౌండేషన్‌లో వుంటున్నాను.
డెన్ జీవితంలోకి
కొంత కాలం తర్వాత మా అక్క భర్త కాల్వ నారాయణరెడ్డి వచ్చి నన్ను తనతో పాటు తీసుకెళతామన్నారు. కానీ మా అమ్మానాన్న ఒప్పుకోలేదు. నాకు పెండ్లి చేయాలనుకు న్నారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే పార్టీలో పని చేస్తానని చెప్పాను. కొద్ది రోజుల తర్వాత మా బావ వచ్చి నన్ను తీసుకెళ్ళారు. నేను మా అక్క దగ్గర ఉంటానని అందరూ అనుకున్నారు. కానీ నేను వెళ్ళిన డెన్‌లో రావి నారాయణరెడ్డి, సీతాదేవి ఉన్నారు. మొదట్లో కాస్త భయం వేసింది. అక్కడ నా పేరు ప్రమద అని మార్చారు. నారాయణరెడ్డి నాపై చూపిన అభిమానం నా కుటుంబాన్ని వదిలి వచ్చాననే బాధను పోగొట్టింది. తర్వాత మరో రహస్య ప్రదేశానికి వెళ్ళాను. పార్టీకి సంబంధించిన అన్ని సర్క్యులర్లు మేమే చేసేవాళ్ళం. నా చేతిరాత చాలా బాగుండేది. స్పీడ్‌గా కూడా రాసేదాన్ని. దాంతో నన్ను ఈ పనికి కేటాయించారు. నా పని విధానం నచ్చి పధ్నాలుగేండ్లకే పార్టీ సభ్యత్వం ఇచ్చారు. చాలా ఆనందించాను. పోరాట ప్రాంతాల నుండి వచ్చే రిపోర్టుల్లో మహిళలు నిర్వహిస్తున్న పాత్రను చూసి చాలా ఉత్సాహంగా అనిపించేది.
– సలీమ