నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే టీఎస్ అర్టీసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం బిల్లు ప్రతిపాదనను గవర్నర్ వద్దకు పంపింది. కానీ ఈ బిల్లు పరిశీలనకు కాస్త సమయం పడుతుందని.. రాజ్ భవన్ ప్రకటన జారీ చేసింది. టీఎస్ఆర్టీసీ బిల్లును రాజ్ భవన్ పెండింగ్‌లో ఉంచినందున.. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2 గంటలు బంద్ చేసేందుకు ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆర్టీసీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. గవర్నర్ బిల్లును ఆమోదించాలని ఆర్టీసీ టీఎంయూ నిరసన చేపట్టనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కార్మికులు నెక్లెస్ రోడ్డుకు రావాలని యూనియన్ ప్రకటించింది. రాజ్‌భవన్ వద్ద ఆర్టీసీ కార్మికులు తమ నిరసన తెలియజేయనున్నారు. ఆర్టీసీ సేవల బంద్ ను గమనించి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.