రేపు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ.. బడ్జెట్‌ సమావేశాలపై చర్చ..

నవతెలంగాణ- హైదరాబాద్‌: తెలంగాణ క్యాబినెట్‌ ఆదివారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రానున్న బడ్జెట్‌ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు బడ్జెట్‌ సమావేశాల తేదీల అంశం కూడా చర్చకు రానుంది. అయితే ఈసారి పూర్తి బడ్జెట్‌ కాకుండా ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశంలో ఆరు హామీలపై చర్చ జరగనుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటించారు. ఉచిత విద్యుత్‌, రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ అంటూ ప్రచారం జరిగింది. త్వరలోనే ఇది అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ రెండు అంశాలపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ అంశాలే కాకుండా పలు కీలక అంశాలపై కేబినెట్‌ చర్చకు అవకాశం ఉంది.ఈ నెల 8 నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. 9వ తేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. 10న మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత 12 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. 6 హామీల్లో మరో రెండు పథకాలు రూ. 500 గ్యాస్‌ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో.. రేపటి కేబినెట్‌ భేటీలో వాటిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈసారి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బేరీజు వేసుకుని పూర్తిస్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Spread the love