లండన్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

నవతెలంగాణ – హైదరాబాద్‌: యూకే రాజధాని లండన్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి పదేండ్లు అయిన సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా-UKTA) ఆధ్వర్యంలో శనివారం వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు యూకే మెంబెర్ ఆఫ్ పార్లమెంట్ వీరేంద్ర శర్మ, ఏఐ పాలసీ వ్యవస్థాపకులు ఉదయ్ నాగరాజు, ప్రముఖ సంగీత దర్శకులు రమణ మూర్తి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతదేశం వెలుపల తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నందుకు యుక్తకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. యుక్త వారు ప్రవాస తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఉదయ్‌ నాగరాజు కొనియాడారు. రమణ మూర్తి సంగీత కచేరి ఆహుతులను అలరించింది. యుక్త ట్రస్టీ రాజశేఖర్ కుర్బా, ప్రెసిడెంట్ అమర్నాథ్ చింతపల్లి, క్రాంతి అలుక, సత్య మద్దసాని, శ్రవణ్ లట్టుపల్లి, ప్రసాద్ కందిబండ, బీవీ కుమార్‌తోపాటు వివిధ రంగాల నిపుణులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Spread the love