నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సాధించుకుని విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తై.. పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో శాఖ ఆధ్వర్యంలో మంత్రులు.. అధికారులు.. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న మహిళా సదస్సులకు అంగన్వాడీ టీచర్లు, సెర్ఫ్ సిబ్బందితో పాటు వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా చర్యలు చేపట్టారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మహిళా సంక్షేమ దినోత్సవం వేదికగా ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారు.